- యుద్ధం మీరు స్టార్ట్ చేశారు.. మేం ఫినిష్ చేస్తామన్న నెతన్యాహు
- ఐఎస్ తరహాలోనే హమాస్ ఊచకోతలకు పాల్పడుతోందని ఆరోపణ
- ఈ పోరాటంలో నాగరిక ప్రపంచమంతా తమకు మద్దతివ్వాలని పిలుపు
- నాలుగు రోజుల్లో 1,830 మంది మృతి.. వేలాది మందికి గాయాలు
- ఇజ్రాయెల్‌లో 1000.. గాజాలో 830కి పెరిగిన మరణాలు
జెరూసలెం : ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తరహాలో ఆటవిక దాడులకు తెగబడుతున్న పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు మరిచిపోలేని గుణపాఠం చెప్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టిగా హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహు మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ యుద్ధాన్ని మేం కోరుకోలే. అత్యంత కిరాతకమైన, క్రూరమైన దాడుల కారణంగా బలవంతంగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టలేదు. కానీ ముగిస్తుంది” అని స్పష్టం చేశారు. తమపై దాడి చేయడం చరిత్రాత్మకమైన తప్పిదమని హమాస్ అర్థం చేసుకుంటుందని, వాళ్లు మరిచిపోలేని స్థాయిలో భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు.
ఈ యుద్ధంలో తాము నేర్పే గుణపాఠం తమ ఇతర శత్రువులకు కూడా కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందన్నారు. ‘‘అమాయకులైన ఇజ్రాయెలీలపైన హమాస్ మిలిటెంట్లు చేసిన ఆటవిక దాడులు షాక్ కు గురిచేస్తున్నాయి. ఫెస్టివల్లో పాల్గొన్న వందలాది మంది యువతను వెంటాడి ఊచకోత కోశారు. మహిళలను, వృద్ధులను కిడ్నాప్ చేస్తున్నారు. పిల్లలను సైతం బంధించి మారణహోమానికి పాల్పడుతున్నారు. వారు అత్యంత క్రూరులు”అని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గాజాపై ప్రయోగిస్తున్న బాంబుల్లో నిషేధిత వైట్ ఫాస్ఫరస్ పౌడర్‌ను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. వైట్ ఫాస్ఫరస్ ను బాంబుల్లో ఉపయోగిస్తే 815 డిగ్రీ సెల్షియస్ల హీట్‌ను పుట్టిస్తుంది. వైట్ ఫాస్ఫరస్ వాడకాన్ని యూఎన్ నిషేధించింది.
హమాస్.. ఐఎస్ ఒక్కటే
హమాస్ మిలిటెంట్ల దారుణాలు ఐఎస్ టెర్రరిస్ట్‌లను పోలి ఉన్నాయని.. ఆ రెండు మిలిటెంట్ సంస్థలు ఒక్కటేనని నెతన్యాహు స్పష్టం చేశారు. ఐఎస్ ను ఓడించేందుకు గతంలో దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయో.. ఇప్పుడు హమాస్‌ను ఓడించేందుకూ అలాగే ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, ఇతర ప్రపంచ దేశాల అధినేతలకు నెతన్యాహు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కేవలం మా కోసమే కాదు. అరాచకత్వానికి వ్యతిరేకంగా నిలబడే ప్రతి దేశం కోసం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుంది” అని నెతన్యాహు చెప్పారు.
గాజా బార్డర్లో 3 లక్షల సైన్యం
గాజాను అన్ని వైపులా దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్ వరుసగా నాలుగో రోజు కూడా బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాపై గగనతలమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. మరోవైపు హమాస్ కూడా రాకెట్ దాడులు కొనసాగించింది. బార్డర్‌లోని ప్రాంతాలన్నీ సైరన్ మోతలతో మారుమోగాయి. ప్రజలంతా బేస్ మెంట్లు, షెల్టర్లలో తలదాచుకున్నారు. కాగా, గాజా బార్డర్ లో దాదాపు 3 లక్షల మంది సైన్యాన్ని ఇజ్రాయెల్ మోహరించింది. శనివారం ఉదయం మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకూ హమాస్ దాడుల్లో 700 మంది ఇజ్రాయెలీలు చనిపోయారని, 2,300 మంది గాయపడ్డారని తెలిపింది.
ఏ దేశమూ జోక్యం చేసుకోవద్దు: అమెరికా
మిలిటెంట్ల దాడుల్లో 11 మంది అమెరికన్లు చనిపోయారని అమెరికా తెలిపింది. అయితే, ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ఇరాన్ సహా ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.
ఇరువైపులా మొత్తం 1,830 మంది మృతి
ఈ యుద్ధంలో మంగళవారం నాటికి ఇరువైపులా మొత్తం 1,830 మంది చనిపోయి నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటివరకు హమాస్ దాడుల్లో 1000 మంది చనిపోగా, 2,600 మంది గాయపడ్డారు. గాజాలో 830 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. మొత్తం 4 వేల మంది గాయపడ్డారని తెలిపింది. అయితే, గాజా స్ట్రిప్ చుట్టూ ఇజ్రాయెల్ భూభాగంలో 1500 మంది హమాస్ మిలిటెంట్ల డెడ్ బాడీలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెక్ట్ మీడియాకు వెల్లడించారు. దీనిపై పాలస్తీనా వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గాజా బార్డర్‌పై ఇజ్రాయెలీ బలగాలు పట్టు సాధిస్తున్నాయని తెలిపారు.
దాడి చేస్తే.. బందీలను చంపేస్తాం : హమాస్
గాజాలోని పాలస్తీనియన్ల ఇండ్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. తమ దగ్గరున్న100 మంది బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించింది. ‘‘మా ప్రజలపై జరిగే ఒక్కో దాడికి.. ప్రతీకారంగా ఒక్కో బందీని చంపేస్తాం” అని హమాస్ అధికార ప్రతినిధి అబూ ఉబైదా హెచ్చరించారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో బందీల్లోని నలుగురు ఇజ్రాయెలీ పౌరులు చనిపోయారని పేర్కొంది.
గాజా నిర్బంధంపై యూఎన్ ఆందోళన
గాజా స్ట్రిప్ మొత్తాన్ని అన్ని వైపుల నుంచీ సీజ్ చేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంపై యూఎన్ ఆందోళన వ్యక్తంచేసింది. గాజాను సీజ్ చేస్తే అక్కడి ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.