గాజాపై ఇజ్రాయెల్ దాడి ..12 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడి ..12 మంది మృతి

డీర్ అల్ బలాహ్: గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 12 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నార్తర్న్ గాజా జబాలియా ఏరియాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దీంతో ఆ బిల్డింగ్ మొత్తం ధ్వంసమైంది. అక్టోబర్ నుంచి నార్తర్న్ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినట్లు గాజా హెల్త్ మినిస్టర్ తెలిపారు. ప్రజలు నివాసం ఉంటున్న బిల్డింగ్​లు, హాస్పిటల్స్​నే ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నదని మండిపడ్డారు. 

అమాయక ప్రజలను చంపేస్తున్నదని ఫైర్ అయ్యారు. జబాలియా ఏరియాపై జరిపిన దాడిలో ఏడుగురు పౌరులు చనిపోయారని, మృతుల్లో ఓ మహిళ, నలుగురు చిన్నారులున్నట్లు వివరించారు. 15 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. సెంట్రల్ గాజాలోని బురీజ్ రెఫ్యూజీ క్యాంప్​పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ అటాక్​లో ఓ మహిళ, చిన్నారి చనిపోయారు. అప్రమత్తమైన అధికారులు.. రెఫ్యూజీ క్యాంప్​లో ఉన్నవాళ్లను వేరేచోటికి తరలించారు. ఇటీవల పాలస్తీనియన్ మిలిటెంట్లు జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటున్నది.