గాజాపై ఇజ్రాయెల్ భీకర​ దాడులు.. 26 మంది దుర్మరణం

గాజాపై ఇజ్రాయెల్ భీకర​ దాడులు.. 26 మంది దుర్మరణం

 

  • 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో 50వేల మంది మృతి
  • 1.13 లక్షల మందికి గాయాలు


గాజా: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్నది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌‌ రాజకీయ నేత సహా పలువురు మహిళలు, చిన్నారులు చనిపోయారు. డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు జరిపింది. 24 డెడ్​బాడీలు వచ్చాయని యూరోపియన్ హాస్పిటల్ తెలిపింది. ‘‘ మృతుల్లో ఐదుగురు చిన్నారులు, వాళ్ల పేరెంట్స్ ఉన్నారు. ఖాన్​యూనిస్​లో జరిగిన దాడిలో వీళ్లు చనిపోయారు. మరో దాడి ఘటనలో ఇద్దరు అమ్మాయిలు, వాళ్ల పేరెంట్స్ కూడా మృతి చెందారు. ఓ ఇంటి నుంచి ఇద్దరు చిన్నారు, వాళ్ల తల్లిదండ్రుల డెడ్​బాడీలు స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు.

మహిళలు, చిన్నారులు..

గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటి దాకా 50 వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వివరించింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు తెలిపింది. 15 నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్నది. గాజాను స్వాధీనం చేసుకోవడంతో పాటు తమ దేశానికి చెందిన బంధీలను విడిపించుకునేందుకు హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది పాలస్తీనియన్లు కట్టుబట్టలతో గాజాను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పుట్టిన గడ్డను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పలువురు పాలస్తీనియన్లు చెప్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నదని మండిపడ్తున్నారు. అయితే.. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఆ తర్వాతి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకు దాదాపు 20వేల మంది మిలిటెంట్లను చంపినట్లు ఇజ్రాయెల్​ పేర్కొన్నది.