- గాజాలోని రెఫ్యూజీ క్యాంప్నూ ఖాళీ చేయాలని వార్నింగ్
- దానిపైనా దాడులు చేసే అవకాశం
గాజా/జెరూసలెం: ఒకవైపు లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్లతో కాల్పుల విరమణ పాటిస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్లు టార్గెట్గా దాడులు కొనసాగిస్తోంది. బుధవారం బార్డర్ కు దగ్గర్లోని బీట్ లాహియా టౌన్ లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 19 మంది మృతి చెందారని స్థానిక కమల్ అద్వాన్ హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు అని, వారిలో నలుగురు పిల్లలు, ఇద్దరు వృద్ధులు ఉన్నారని తెలిపారు. తమ హాస్పిటల్ ఎంట్రెన్స్ సమీపంలో జరిగిన మరో బాంబు దాడిలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పారు.
అలాగే సెంట్రల్ గాజాలోని నుసీరత్ రెఫ్యూజీ క్యాంపుపైనా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసిందని, ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారని వెల్లడించారు. అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు బుధవారం నాలుగు రాకెట్లను ప్రయోగించగా, రెండింటిని కూల్చేశామని, మరో రెండు ఓపెన్ ఏరియాలో పడ్డాయని మాత్రం తెలిపింది. అయితే, గాజాలోని మఘజీ రెఫ్యూజీ క్యాంపును ఖాళీ చేయాలంటూ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ రెఫ్యూజీ క్యాంపుపైనా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
సిరియా పైనా భీకర దాడులు
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన వేలాది మంది హమాస్ మిలిటెంట్లు 1200 మందిని ఊచకోత కోశారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో కొందరిని విడిచిపెట్టగా, మరికొందరు చనిపోయారు. ఇప్పటికీ మరో 100 మంది గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ దాదాపు 44 వేల మంది పాలస్తీనియన్లు చనిపోగా, మరికొన్ని వేల మంది గాయపడ్డారు. మరోవైపు ఇటీవల ఇజ్రాయెల్ పొరుగు దేశం సిరియాలో ప్రభుత్వం కూలిపోయి, ఆ దేశం రెబెల్స్ చేతికి చిక్కడంతో అక్కడి ఆయుధ డిపోలు, ఆర్మీ, నేవీ స్థావరాలనూ ఐడీఎఫ్ ధ్వంసం చేస్తోంది. రెబెల్స్ చేతికి కీలక ఆయుధాలు చిక్కకుండా ముందు జాగ్రత్తతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.