పశ్చిమాసియా దేశాల్లో మరో యుద్ధం మొదలైంది. లెబనాన్పై ఇజ్రాయెల్ విమానాలతో బాంబులు కురిపిస్తుంది. ఇప్పటికే 100 మందిని చంపేసిన ఇజ్రాయెల్ బాంబు దాడులు.. మరో 80 వేల మందికి వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్లో 80 వేల మందికి ఫోన్ కాల్స్ ద్వారా వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్.. ‘‘మీరు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు’’ అనేది ఆ ఫోన్ కాల్స్ సారాంశం. దీంతో ఫోన్ కాల్స్ అందుకున్న లెబనాన్ జనం.. ఎటు వెళ్లాలి.. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనే ఆందోళనలో పడ్డారు. ఓ వైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు.. విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కళ్ల ముందు వంద మంది చనిపోయారు. ఇలాంటి టైంలో వచ్చిన ఫోన్ కాల్స్ నిజమే అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లెబనాన్ జనం. ఫోన్ కాల్ వార్నింగ్స్ అందుకున్న 80 వేల మంది ప్రజలు.. ఇప్పుడు లెబనాన్ వీధుల్లో భయం భయంగా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎటువైపు నుంచి ఏ బాంబులు పడతాయో.. రాకెట్లు వచ్చి ప్రాణాలు తీస్తుందో అని వణికిపోతున్నారు.
లెబనాన్లో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. ఇరాన్ మద్దతుతో పేలుళ్లకు తెగబడుతున్న హెజ్బొల్లా మిలిటెంట్సంస్థకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) లెబనాన్ ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. లెబనాన్ ప్రజలు తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్స్థావరాలపై దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. హెజ్బొల్లా మిలిటెంట్సంస్థ ఆయుధాలు నిల్వ చేసుకున్న దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది.
హెజ్బొల్లా మిలిటెంట్లు ఆయుధాలు నిల్వ చేసుకున్న స్థావరాలపై మెరుపు దాడులకు దిగాలని ఇజ్రాయెల్ సైన్యం భావించింది. సోమవారం (సెప్టెంబర్ 23, 2024) నాడు ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో చేసిన ఈ మెరుపు దాడుల్లో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులను ఏరివేయాలని ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న ఈ దాడుల్లో కొందరు అమాయకులైన లెబనాన్ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతుండటం శోచనీయం. లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం (IDF) సోమవారం జరిపిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు, కొందరు వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
లెబనాన్ అధికార యంత్రాంగం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని దగ్గరదగ్గర 80 వేలకు పైగా ఇజ్రాయెలీ కాల్స్.. సోమవారం (సెప్టెంబర్ 23, 2024) లెబనాన్ ప్రజలకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం లెబనాన్లో ఒకేసారి 3000 పేజర్లు పేలాయి. ఈ ఘటనలో 37 మంది చనిపోగా..3 వేల మందికి పైగా గాయపడ్డారు. ఆ మరుసటి రోజే వాకీటాకీలు, రేడియోలు పేలిపోయాయి. ఇది ఇజ్రాయెల్ పనేనని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా శపథం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్పై దాడికి దిగింది. డజన్ల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్విరుచుకుపడిందని లెబనాన్భద్రతా సిబ్బంది వెల్లడించారు.
ALSO READ | ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు..50 మంది మృతి
ఇజ్రాయెల్ ఆర్మీ, లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య పరస్పరం భీకర దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బొల్లా 140 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరుట్ సహా దక్షిణాది ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ బీరుట్లోని ఓ స్థావరంపై జరిగిన దాడిలో హెజ్బొల్లాకు చెందిన రద్వాన్ యూనిట్ చీఫ్, టాప్ కమాండర్ ఇబ్రహీం అఖీల్ మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇబ్రహీంతో సహా 12 మంది చనిపోగా, 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాల్లో దాదాపు వెయ్యి రాకెట్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.