హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కూరగాయల సాగులో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేస్తామని హార్టికల్చర్ వర్సిటీ వీసీ డాక్టర్ బి. నీరజా ప్రభాకర్ అన్నారు. హార్టికల్చర్ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో పలు జిల్లాల హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతుబంధు సమితి ప్రతినిధులు, సైంటిస్టులు మూడ్రోజులుగా ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్లో తక్కువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతి ద్వారా హార్టికల్చర్ క్రాప్స్ సాగు చేస్తున్నారని తెలిపారు.
అత్యధిక ఉత్పాదకత, నాణ్యతను కూడా సాధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్ హౌజ్‌లలో సాగు ద్వారా మరిన్ని లాభాలు పొందేందుకు ఇజ్రాయెల్ విధానాలు పనికి వస్తాయని వివరించారు. పర్యటనలో భాగంగా నీరజా ప్రభాకర్ బృందం ఆవకడో, ద్రాక్ష, దానిమ్మ తోటలను పరిశీలించింది. వివిధ కూరగాయలు, తోట పంటల్లో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న మెకనైజేషన్, సాగులో ఉన్న వంగడాల వివరాలను అడిగి తెలుసుకుంది.