- ఎన్వీఎస్-02 శాటిలైట్‌ను అంతరిక్షానికి చేర్చిన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్
- 1979లో షార్ నుంచి తొలి ప్రయోగం..46 ఏండ్లకు 100వ మైలురాయి
- అమెరికా, ఫ్రాన్స్, రష్యా నుంచీ రాకెట్ ప్రయోగాలు..
- విదేశాల్లోని ప్రయోగాలతో కలిపి మొత్తం 130 మిషన్లు పూర్తి
- వచ్చే ఐదేండ్లలోనే 100 ప్రయోగాలు: ఇస్రో చైర్మన్
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగాల్లో సెంచరీ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి100వ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. షార్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన జీఎస్ఎల్ వీ–ఎఫ్15 రాకెట్ 2,250 కిలోల బరువైన ఎన్ వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ప్రయోగించిన 19 నిమిషాల తర్వాత భూమికి 35 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో)లోకి ఎన్ వీఎస్-02 ఉపగ్రహాన్ని రాకెట్ విడిచిపెట్టింది.
దీంతో షార్ నుంచి తొలిసారి1979లో తొలి రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో.. 46 ఏండ్ల తర్వాత ఇప్పుడు 100వ రాకెట్ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకున్నది. అయితే, అమెరికా, ఫ్రాన్స్, రష్యా రాకెట్ ల ద్వారా ఆయా దేశాల్లోని లాంచ్ ప్యాడ్ ల నుంచి నిర్వహించిన ఉపగ్రహ ప్రయోగాలను కూడా కలిపితే.. ఇప్పటివరకూ ఇస్రో చేపట్టిన శాటిలైట్ మిషన్ల సంఖ్య 130కి చేరినట్టయింది.
ఇది ఓవరాల్ గా ఇస్రోకు 17వ జీఎస్ఎల్వీ మిషన్ కాగా, స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ తో కూడిన రాకెట్ ను ప్రయోగించడం11వ సారి. అలాగే ఇస్రో చైర్మన్ గా ఈ నెల 16న వి. నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ప్రయోగం ఇదే. ఈ ఏడాది ఇస్రోకు కూడా ఇదే తొలి మిషన్.
‘నావిక్’లోకి రెండో ఎన్ వీఎస్ శాటిలైట్
భారత భూభాగంతోపాటు చుట్టూ1,500 కిలోమీటర్ల వరకూ నావిగేషన్ సేవలను అందించేందుకు ఇస్రో స్వదేశీ టెక్నాలజీతో నావిక్(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్టెల్లేషన్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. నావిక్ లోకి ఇప్పటివరకూ ఫస్ట్ జనరేషన్ కు చెందిన ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ లో 9 శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ శాటిలైట్లలో భాగంగా 5 ఎన్ వీఎస్ ఉపగ్రహాలను పంపనుంది. వీటిలో ఎన్ వీఎస్–01 ఉపగ్రహాన్ని 2023లోనే పంపగా.. తాజాగా రెండోదైన ఎన్ వీఎస్02ను కక్ష్యలోకి చేర్చింది. నావిక్ వ్యవస్థ ద్వారా 20 మీటర్ల కచ్చితత్వంతో జీపీఎస్ సేవలను ఇస్రో అందిస్తోంది.
కాగా, 2,250 కిలోల బరువైన ఎన్ వీఎస్-–02 ఉపగ్రహంలో నావిగేషన్ పేలోడ్, ఎస్, సీ బ్యాండ్లు ఉంటాయి. భూభాగంతోపాటు సముద్రతలంపైనా నావిగేషన్ సేవలకు ఇది ఉపయోగపడనుంది. మొబైల్ ఫోన్లలో లొకేషన్ ఆధారిత సేవలకు, ఉపగ్రహాలకు కక్ష్యల నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఎమర్జెన్సీ, టైమింగ్ సర్వీస్, వాతావరణ సమాచార సేవలను ఇది అందించనుంది. మొదటిసారిగా దేశీయంగా తయారుచేసిన అత్యంత కచ్చితత్వంతో పని చేసే అటామిక్ క్లాక్(రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్)ను అమర్చడం మరో విశేషం. ఈ శాటిలైట్ 12 ఏండ్లు సేవలు అందించనుంది.
భూస్థిర బదిలీ కక్ష్యలోకే ఎందుకు?
వేల కిలోల బరువుండే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను 35 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్య(జీటీవో)లోకే చేర్చాల్సి ఉంటుంది. ఈ కక్ష్యలోకి చేరే ఉపగ్రహాలు ఎల్లప్పుడూ ఒకే భూభాగం మీదే ఉంటూ డేటాను అందిస్తుంటాయి. కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు ఇలా స్థిరంగా ఒకే ప్రాంతంపై శాటిలైట్లు ఉండటం అత్యంత కీలకం కాబట్టి వీటిని జీటీవోలోకే చేర్చాల్సి ఉంటుంది. దీంతోపాటు జీటీవో నుంచి నిరంతరం వాటికి నిర్దేశించిన ప్రాంతాన్నే ఉపగ్రహాలు మానిటర్ చేయడం ద్వారా వాతావరణ సమాచారాన్ని కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చు.
వచ్చే ఐదేండ్లలోనే 100 ప్రయోగాలు: ఇస్రో చీఫ్
జీఎస్ఎల్ వీ–ఎఫ్15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం తర్వాత షార్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘షార్ లోని లాంచ్ ప్యాడ్ ల నుంచి ఇది 100వ ప్రయోగం. రాకెట్ ప్రయోగాల్లో ఇది దేశానికి కీలక మైలురాయి. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ నుంచి ఎంతో మంది గొప్ప సైంటిస్టులు, నాయకుల సారథ్యంలో ఇస్రో నేడు ఈ మైలురాయిని చేరుకుంది.
ఇప్పుడు రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలిచింది. వచ్చే ఐదేండ్లలోనే మరో 100 ప్రయోగాలు పూర్తి చేసి.. 200వ మైలురాయిని చేరుకుంటాం” అని ఇస్రో చీఫ్ ప్రకటించారు. ‘‘శ్రీహరికోట నుంచి తొలిసారిగా 1979లో ప్రొఫెసర్ సతీశ్ ధవన్ సారథ్యంలో, ఏపీజే అబ్దుల్ కలాం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎస్ఎల్ వీ–2 ఈ1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్ ను ప్రయోగించారు. కానీ ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. అప్పటి నుంచి నేటి వరకూ షార్ వేదికగా100 రాకెట్ ప్రయోగాలు జరిగాయి. ఇప్పటివరకూ మొత్తం 548 శాటిలైట్లను ఇస్రో అంతరిక్షానికి పంపింది. వీటిలో 433 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి” అని ఆయన వివరించారు.