బెంగళూరు: గగన్‌యాన్ కోసం హ్యుమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్--- 3(హెచ్ఎల్వీఎం 3) ని అసెంబుల్ చేయడం ప్రారంభించినట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు హెచ్ఎల్వీఎం 3 కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇప్పటికే చేరుకున్నాయని తెలిపింది. మానవ రహిత గగన్‌యాన్ ప్రయోగం 2025లో చేపడుతున్నట్లు వెల్లడించింది. కాగా, స్పేస్‌లోకి మనిషిని పంపాలనే లక్ష్యంతో ఇస్రో ముందుకు పోతున్నది. ఇందులో భాగంగా రూపొందిస్తున్న గగన్ యాన్‌కు సంబంధించి.. ముందుగా మానవ రహిత ప్రయోగానికి సిద్ధమవుతున్నది.
‘‘హెచ్ఎల్వీఎం3ని గగన్‌యాన్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశాం. ఇది 3 స్టేజ్ వెహికల్. 640 టన్నుల బరువు.. 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో)లోనూ 10 టన్నుల పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) ఉంటుంది. మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌కు ఇది మరింత విశ్వాసం పెంచుతుంది.
మాడ్యూల్‌ను కక్ష్యలోకి ఇంజెక్ట్ చేసే వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డిజైన్ చేశాం. ఆర్బిటాల్ మాడ్యూల్ ఫైనల్ టెస్ట్ బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో చేస్తాం’’అని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు.