తిరువనంతపురం: ప్రణాళిక ప్రకారం అన్ని టెస్టులు సాఫీగా జరిగితే చంద్రయాన్~-3 ప్రయోగాన్ని జులై 12 నుంచి 19 మధ్య చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన కొట్టాయం జిల్లా వైకంలో ఉన్న కొతవార సెయింట్ జేవియర్ కాలేజీలో ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు వర్క్‌షాప్, స్పేస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ..ఇప్పటికే చంద్రయాన్ ~3 వ్యోమనౌక యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్‌కు చేరుకుందని తెలిపారు. " ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి.
ఈ ప్రయోగానికి ఎల్వీఎమ్ 3 అనే రాకెట్‌ను ఉపయోగించబోతున్నం. అందుకు ప్రాసెస్ జరుగుతోంది. అన్ని భాగాలు శ్రీహరికోటకు చేరుకున్నాయి. " అని ఇస్రో చైర్మన్ వివరించారు. ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చంద్రయాన్-3లో హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను , సెన్సార్లలో అనేక మార్పులు చేశామని చెప్పారు. " చంద్రయాన్-3లో ఇదివరకటి కంటే ఎక్కువ ఇంధనం నింపాం.ల్యాండింగ్ కాళ్లు కూడా బలోపేతం చేశాం. శక్తిని మరింత ఉత్పత్తి చేయడానికి పెద్ద సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేశాం. అదనపు సెన్సార్లు కూడా ఉన్నాయి. దాని వేగాన్ని కొలవడానికి 'లేజర్ డాప్లర్ వెలోసిమీటర్' అనే పరికరం వాడనున్నాం. షెడ్యూల్ చేసిన ప్రదేశంలో ఏదైనా సమస్య తలెత్తితే చంద్రయాన్‌ను వెంటనే మరొక ప్రాంతంలో ల్యాండ్ చేసేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చాం."అని సోమనాథ్ పేర్కొన్నారు.