ఇస్రో చైర్మన్ సోమనాథ్ గగన్ యాన్ మిషన్ పై కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా.. ఈ మిషన్‌ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా సోమనాథ్ రీషెడ్యూల్‌ను తెలిపారు.
ఇస్రో తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్‌యాన్ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి, సురక్షితంగా వారిని భూమిపైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యం. ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతం తర్వాత తదుపరి మిషన్ అయిన గగన్‌యాన్ కోసం సిబ్బంది కసరత్తు చేస్తున్నారు.
ALSO READ | జనం లెక్క తేల్చేద్దాం: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో మొదలు
గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి పంపి.. తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మూడు రోజులపాటు జరుగనున్నది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. వాస్తవానికి 2022లోనే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయితా పడుతూ వచ్చింది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.