2026లోనే గగన్​యాన్​ ప్రయోగం.. కొత్త షెడ్యూల్ ప్రకటించిన ఇస్రో చైర్మన్

2026లోనే గగన్​యాన్​ ప్రయోగం.. కొత్త షెడ్యూల్ ప్రకటించిన ఇస్రో చైర్మన్

 

న్యూఢిల్లీ: భారత ప్రతిష్టాత్మక ‘గగన్ యాన్’​ మిషన్​ను 2025లో చేపట్టడంలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌‌ యాన్’ మిషన్‌‌ ప్రయోగాన్ని 2026లో చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా సోమనాథ్​ సోమవారం ఈ షెడ్యూల్​ను ప్రకటించారు. రానున్న సంవత్సరాల్లో ఇస్రో చేపట్టబోయే ప్రయోగ వివరాలను వెల్లడించారు. 

చంద్రయాన్​4 శాంపిల్​ రిటర్న్​ మిషన్ 2028లో ప్రారంభమయ్యే చాన్స్​ ఉన్నదని తెలిపారు. అలాగే, భారత్​– అమెరికా సంయుక్తంగా చేపట్టదలచిన ‘నిసార్’ ​మిషన్​ను 2025లోనే ప్రారంభించే అవకాశం ఉందన్నారు. జపాన్ స్పేస్​ ఏజెన్సీ జక్సాతో కలిసి చంద్రయాన్​–5 మిషన్​ ప్రయోగాన్ని నిర్వహించనున్నామని, ఇది మూన్​ల్యాండింగ్ మిషన్​ అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించేది సోమనాథ్ వెల్లడించలేదు. చంద్రయాన్​–4 తర్వాత 2028లో ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, రాబోయే దశాబ్దంలో గ్లోబల్​ స్పేస్​ ఎకానమీకి భారత్​ సహకారాన్ని  2 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే ఇస్రో లక్ష్యమని సోమనాథ్​ వెల్లడించారు.