తిరువనంతపురం: ఇస్రో చీఫ్ సోమనాథ్, యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ ప్రతిష్టాత్మక కేరళ-2024 అవార్డ్‌కు ఎంపికయ్యారు. 2024 సంవత్సరానికి సంబంధించిన కేరళ అవార్డ్స్‌ను పినరయ్ విజయన్ ప్రభుత్వం 2024, నవంబర్ 1 శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 8 మందికి అవార్డులకు ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇస్రో చీఫ్ సోమనాథ్, సంజు శాంసన్‌తో పాటు మరో ఆరుగురు ప్రముఖులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
సాహిత్యంలో విశేష కృషి చేసిన ఎంకే సానూ కేరళ జ్యోతికి అవార్డుకు సెలెక్ట్ కాగా.. సోమనాథ్, వ్యవసాయ శాస్త్రవేత్త భువనేశ్వరి కేరళ ప్రభ అవార్డులకు ఎంపికయ్యారు. సంజు శాంసన్ (క్రీడలు), నారాయణ భట్టాతిరి (కాలిగ్రఫీ), కళామండలం విమలా మీనన్ (కళ), డాక్టర్ టికె జయకుమార్ (ఆరోగ్యం), వీకే మాథ్యూస్ (పరిశ్రమ-కామర్స్), షైజా బేబీ (సామాజిక సేవ, ఆశాగా) కేరళ శ్రీ కేటగిరీ అవార్డులకు సెలక్ట్ అయ్యారు.
కేరళ అవార్డ్స్:
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ శ్రీ అవార్డ్ తరహాలో కేరళ ప్రభుత్వం ‘కేరళ అవార్డ్’లను రూపొందించింది. 2021 నుండి ప్రదానం చేస్తోన్న ఈ అవార్డ్.. కేరళ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం. ప్రతి సంవత్సరం నవంబర్ 1న కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం 'కేరళప్పిరవి' రోజున ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తోంది. కేరళ జ్యోతి, కేరళ ప్రభ, కేరళ శ్రీ అని మొత్తం మూడు విభాగాల్లో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు కేరళ గవర్నమెంట్ ఈ అవార్డ్ ప్రదానం చేస్తోంది.