న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయికి అడుగు దూరంలో ఉంది. ఇప్పటివరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో.. 100వ ప్రయోగానికి సిద్ధమైంది. 2025, జనవరి 29వ తేదీ ఉదయం శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 మిషన్‌తో 100వ ప్రయోగానికి చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ (SLP) నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
ఈ ప్రయోగం ద్వారా ఇస్రో సెంచరీ మార్క్ అందుకోనుంది. NavIC అనేది భారతదేశ స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ (PVT) సేవలను అందించడానికి రూపొందించబడింది. ఈ శాటిలైట్.. రెండు రకాల సేవలు అందిస్తోంది. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (SPS) ఒకటి.. ఇంకొంటి అదనపు ప్రత్యేక నావిగేషన్ సామర్థ్యాలను అందించే నియంత్రిత సేవ.
GSLV-F15 ప్రయోగం శ్రీహరికోట నుండి ఇస్రో 100వ ప్రయోగాన్ని జరుపుకోవడమే కాకుండా స్వదేశీ అంతరిక్ష సాంకేతికతలు, నావిగేషన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడంలో భారతదేశ నిబద్ధతను చాటుతోంది. ఇటీవల అంతరిక్షం రంగంలో ఇస్రో అద్భుతాలు సృష్టిస్టోన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇప్పటికే వరకు ఏ దేశం చేరుకోలేని చంద్రుడి దక్షిణ దృవంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్‌ను ప్రవేశపెట్టిన ఇస్రో.. తాజాగా అంతరిక్షంలో ఉపగ్రహాల డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసి ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏంటో చూపింది. ఈ క్రమంలోనే శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం చేపట్టబోతున్న ఇస్రోకు పలువురు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.