ISRO : గగన్​యాన్​కు తొలి అడుగు...మాక్ స్పేస్ మిషన్ షురూ

ISRO : గగన్​యాన్​కు తొలి అడుగు...మాక్ స్పేస్ మిషన్ షురూ
  • లడఖ్​లోని లేహ్​లో ప్రారంభించిన ఇస్రో

  • ‘హ్యాబ్–1’ ఆవాసంలో ప్రయోగాలకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ:  భారత్​ చేపట్టబోయే గగన్​యాన్​కు తొలి అడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లకు ఎదురయ్యే సవాళ్లను స్టడీ చేసేందుకు గాను  అనలాగ్ (మాక్) స్పేస్ మిషన్​ను ఇస్రో ప్రారంభించింది. అంతరిక్ష యాత్రల్లో, ఇతర గ్రహాలపై ఆస్ట్రోనాట్లు నివసించే ఆవాసం మాదిరిగా తయారుచేసిన ‘హ్యాబ్–1’ను శుక్రవారం లడఖ్​లోని లేహ్​లో ఏర్పాటు చేసింది. సాధారణంగా ఇతర గ్రహాలపై ఉండే పరిస్థితులను ఎదుర్కొనేలా భూమిపైనే అలాంటి వాతావరణం ఉండే ప్రదేశాల్లో ఉత్తుత్తి మిషన్​ను చేపట్టడాన్నే అనలాగ్ స్పేస్ మిషన్​గా పిలుస్తారు. మూన్ తోపాటు మార్స్ వంటి గ్రహాలపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, అక్కడి వనరులతోనే ఆస్ట్రోనాట్లు ఎలా మనుగడ సాగించాలనేదానిపై ఈ అనలాగ్ మిషన్​లో స్టడీ చేస్తారు. ఒంటరిగా, సుదీర్ఘ కాలంపాటు జీవనం సాగించడం వల్ల ఆస్ట్రోనాట్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావం, కమ్యూనికేషన్స్​లో ఇబ్బందులు, రోబోటిక్ పరికరాలు, వెహికల్స్ పనితీరును ఈ అనలాగ్ మిషన్ లో ప్రయోగాల ద్వారా పరీక్షించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, రవాణా, మౌలిక వసతులు, స్టోరేజ్ వంటి అంశాలనూ పరిశీలించనున్నారు. 

లేహ్​లోనే ఎందుకంటే.. 

లేహ్​లో నేల కూడా చంద్రుడు, అంగారకుడి ఉపరితలం మాదిరిగానే రాళ్లు, రప్పలతో కూడి ఉంటుంది. సముద్రమట్టానికి చాలా ఎత్తున ఉన్న లేహ్ ప్రాంతంలో వాతావరణం కూడా అంతరిక్షంలో మాదిరిగా చాలా వేగంగా మారిపోతుంటుంది. టెంపరేచర్లు సడెన్ గా పెరుగుతూ, పడిపోతూ ఉంటాయి. అందుకే ఈ అనలాగ్ స్పేస్ మిషన్ కు లేహ్ ప్రాంతాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంపిక చేసుకుంది. ఇతర గ్రహాలపై మాదిరిగా వాతావరణ పరిస్థితులు ఉండేలా ఈ హ్యాబిటాట్–1ను తయారు చేశారు. భవిష్యత్తులో భూమికి దూరంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లకు ఎదురయ్యే సవాళ్లను అధ్యయనం చేసేందుకే ఈ మిషన్ ను చేపట్టినట్టు ఇస్రో వెల్లడించింది.

 హ్యాబ్–1లో కేవలం నీటితోనే కూరగాయలు పండించుకునేలా హైడ్రోపోనిక్స్ ఫార్మ్ తోపాటు కిచెన్, శానిటేషన్ సౌలతులను ఏర్పాటు చేసింది. సుదీర్ఘకాలం పాటు ఇతర గ్రహాలపై ఉండాలంటే అక్కడ సొంతంగా ఆహారం, నీరు, ఆక్సిజన్ వంటివి సమకూర్చుకుంటే తప్ప మనుగడ సాగించడం కష్టమవుతుంది. అందుకే ఈ అనలాగ్ మిషన్​లో సొంతంగా మనుగడ సాగించడంలో తలెత్తే సమస్యలను గుర్తించనున్నారు. ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో సంస్థ, లడఖ్ యూనివర్సిటీ, ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ కు లడఖ్ ఆటోనామస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సహకారం అందిస్తోంది. కాగా, భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ ను 2026లో చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. గగన్ యాన్ కోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.