
మూడు రోజులు.. మూడు అతి పెద్ద భూకంపాలు.. మధ్య మధ్యలో ఇంకా అవ్వలేదు అన్నట్లు వచ్చిన చిన్న చిన్న కదలికలు.. వెరసీ మయన్మార్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. చిన్న ఇండ్ల నుంచి మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ వరకూ.. వంతెన నుంచి బ్రిడ్జీల వరకు.. దేన్నీ వదలకుండా నేలమట్టం చేశాయి మయన్మార్ లో వచ్చిన భూకంపాలు. ఎటు చూసినా శిథిలాలు.. ఆర్థనాదాలు, అంబులెన్స్ ల సైరెన్ లతో శవాల దిబ్బగా మారిపోయింది. మృతుల సంఖ్య దాదాపు 2 వేలను దాటడం ఇటీవలి కాలంలో వచ్చిన అతి పెద్ద విలయంగా చెప్పుకోవచ్చు.
మయన్మార్ భూకంపంపై ఇస్రో (Indian Space Research Organisation -ISRO) సాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసింది. మార్చి 28న రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం మయన్మార్ ను కోలుకోలేని దెబ్బతీసింది. పొరుగు దేశాలను సైతం వణికించింది. 334 అణుబాంబులు వేస్తే వచ్చే శక్తికి సమానమైనది ఈ భూకంపం అని సీస్మాలజిస్టులు ప్రకటించడం చూస్తే ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి భూకంపానికి సంబంధించి.. అది చేసిన విధ్వంసంపై ఇస్రో ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
ఇస్రోకు చెందిన కార్టోసాట్-3 అనే శాటిలైట్ 500 కిలోమీటర్ల పైనుంచి ఫోటోలను తీసి పంపించింది. ఈ ఫోటోలలో మయన్మార్ రాజధాని మాండలే చిత్రాలు, యూనివర్సిటీ, ఇరవద్దీ నదిపై ఉన్న బ్రిడ్జి ఎలా నేలమట్టం అయ్యాయో.. వాటిపై ఎలాంటి ప్రభావం ఉందో ఈ ఇమేజెస్ ను చూస్తే తెలుస్తుంది.
మృత్యువు విలయతాండవం..
మయన్మార్ భూకంపతో ఆ దేశ రాజధాని మాండలే సిటీలో ఎటు చూసినా మృత్యువు విలయతాండవం చేసినట్టుగా కనిపిస్తోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతు న్నాయి. మయన్మార్లో భూకంపం ధాటికి దాదాపు 2,900 భవనాలు కూలిపోయాయి. 30 ప్రధాన రోడ్లు, 7 పెద్ద బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. నేపిడాతోపాటు మాండలేలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు మూసివేశారు. మయన్మార్లో సహాయక చర్యల కోసం భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్, మిలిటరీ హాస్పిటల్స్ సిబ్బందిని పంపింది.
Also Read:-270 మంది మిస్సింగ్ .. 2 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
మాండలే సిటీ సమీపంలోని ‘మహాముని పగోడా’, చారిత్రాత్మక ‘ఎవా బ్రిడ్జి’ కూడా కొలాప్స్ అయ్యింది. దీనికి తోడు పక్కనే ఉన్న థాయిలాండ్ కూడా దారుణంగా దెబ్బతింది. తాజాగా ఇస్రో రిలీజ్ చేసిన ఫోటోలలో భూకంప తీవ్రత ఎలా ఉంది, ఎంత డ్యామేజ్ జరిగిందో చూడవచ్చు.