అద్భుతమైన విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ రాకెట్.. దాని హాఫ్ సెంచురీ మైలురాయిని పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3.25కు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 48 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. రిశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఆర్బిట్‌లోకి చేర్చింది. వాటిలో ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌లకు చెందిన ఒక్కో ఉపగ్రహం, అమెరికాకు చెందిన 9 ఉపగ్రహాలు ఉన్నాయి.
16 నిమిషాల్లో కక్ష్యలోకి
రిశాట్ ఉపగ్రహాన్ని కేవలం 16 నిమిషాల్లో టార్గెటెడ్ ఆర్బిట్‌లోకి చేర్చింది పీఎస్ఎల్వీ రాకెట్. భూమి నుంచి 576 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరగానే రాకెట్ నుంచి ఉపగ్రహం వేరుపడింది. ఈ శాటిలైట్ ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. నింగిలో నుంచి మన సరిహద్దుల్లో ప్రతి కదలికపై హైరెజల్యూషన్ ఫొటోలను తీసి పంపుతుంది. దీని సాయంతో పాక్ ముష్కర చొరబాట్లకు మన ఆర్మీ మరింత సమర్థంగా చెక్ పెట్టనుంది.
రిశాట్ తర్వాత ఒక్కొక్కటిగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. తొమ్మిది శాటిలైట్స్‌ను ఐదు నిమిషాల్లో నిర్దేశించిన కక్ష్యలో విడిచి తన మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. ఇది చారిత్రాత్మక ప్రయోగమని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు.
మన ఆర్మీకి మరింత బలం
రిశాట్–2బీఆర్1 శాటిలైట్‌తో బోర్డర్‌లో మన మిలటరీ నిఘా పవర్ మరింత పెరుగుతుంది. ఇది రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. రిశాట్ సిరీస్‌లో నాలుగు లేదా ఐదు ఉపగ్రహాలను మోహరించాలని ఇస్రో భావిస్తోంది. మొదటి శాటిలైట్ రిశాట్ 2బీని మే 22న నింగికి చేర్చింది. రిశాట్-2బీఆర్1 రెండో ఉపగ్రహం. మూడో శాటిలైట్ రిశాట్ 2బీఆర్2ను కూడా త్వరలోనే ఇస్రో ప్రయోగించనుంది.
రిశాట్ సిరీస్‌లో కనీసం నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపితే.. మన సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాట్లకు చెక్ పెట్టవచ్చని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. సరిహద్దులోని ఏదైనా ఒకే ప్రాంతంపై 24 గంటలపాటూ నిరంతరం ఈ ఉపగ్రహాలతో నిఘా ఉంచవచ్చనీ అంటున్నారు. ఈ ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్ రాడార్ ‘టెక్సార్ 1’ సిస్టం ఆధారంగా తయారు చేసిన పవర్ ఫుల్ రాడార్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒకే సమయంలో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో స్పష్టమైన ఫొటోలు తీయగలవు. కేవలం 0.35 మీటర్ల దూరంలో ఉన్న రెండు వేర్వేరు వస్తువులను కూడా ఇవి స్పష్టంగా గుర్తించగలవు. ఈ రిశాట్ ఉపగ్రహాల సాయంతో విపత్తుల సమయంలో సహాయ చర్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వ్యవసాయ రంగం, అడవుల సంరక్షణకూ తోడ్పడతాయి.
సక్సెస్‌ఫుల్ మైలురాయి
ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగంలో రెండు స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఇస్రోకు సక్సెస్ తెచ్చిపెట్టడంలో నమ్మకమైన లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీకి ఇది 50వ ప్రయోగం. అలాగే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ప్రారంభం తర్వాత జరిగిన 75వ ప్రయోగం. ఈ రెండు మైలురాళ్లు ఒకేసారి కలిసి వచ్చాయి. ఈ స్పెషల్ ప్రయోగం సక్సెస్ కావడం శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని నింపింది. శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలో చేరగానే చప్పట్లు కొడుతూ సంతోషంగా వ్యక్తం చేశారు సైంటిస్టులు.