స్పేస్లో శాటిలైట్ల షేక్​హ్యాండ్.. స్పేడెక్స్ డాకింగ్ మిషన్ విజయవంతం

స్పేస్లో శాటిలైట్ల షేక్​హ్యాండ్.. స్పేడెక్స్ డాకింగ్ మిషన్ విజయవంతం
  • చైనా, రష్యా, అమెరికాకు దీటుగా సత్తా చాటిన ఇండియా
  • స్పేస్ స్టేషన్ ఏర్పాటు దిశగా ఇస్రో తొలి అడుగు
  • మరికొద్ది రోజుల్లో అన్ డాకింగ్, పవర్ ట్రాన్స్​ఫర్ ప్రక్రియ

బెంగళూరు: అంతరిక్ష రంగంలో ఇస్రో చరిత్ర సృష్టించింది. స్పేస్ లో రెండు ఉపగ్రహాలను అనుసంధానం (డాకింగ్) చేసి సత్తా చాటింది. భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేడెక్స్ 01 (చేజర్), స్పేడెక్స్ 02 (టార్గెట్)ను విజయవంతంగా డాకింగ్ చేసినట్లు గురువారం ఇస్రో ప్రకటించింది. పోయిన నెల 30న పీఎస్ఎల్​వీ–సీ 60 రాకెట్ తో రెండు శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపగా.. డాకింగ్ ప్రక్రియ కోసం మూడు సార్లు ప్రయత్నించింది. కానీ పలు కారణాలతో డాకింగ్ వాయిదా పడిందని ఇస్రో వివరించింది. గురువారం ఈ ప్రక్రియను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. 

ఇప్పటి దాకా చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కాగా, పోస్ట్ డాకింగ్, 2 శాటిలైట్లు కంట్రోల్​లోనే ఉన్నాయని ఇస్రో తెలిపింది. రానున్న రోజుల్లో అన్ డాకింగ్, పవర్ ట్రాన్స్​ఫర్ ప్రక్రియలను చెక్ చేస్తామని వివరించింది.

భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో.. 
శ్రీహరికోటలోని షార్‌‌‌‌ ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ–సీ60 ద్వారా స్పేడెక్స్ 01 (చేజర్), స్పేడెక్స్ 02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపింది. లాంచ్ వెహికల్ బయల్దేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 02 (టార్గెట్), ఆ తర్వాత 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 01 (చేజర్) రాకెట్ నుంచి విడిపోయాయి. ఒక్కో శాటిలైట్ బరువు 220 కేజీల వరకు ఉంది. భూమి నుంచి సుమారు 470 కిలో మీటర్ల ఎత్తులో ఈ రెండు శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చింది. 

అప్పుడు ఈ రెండు జంట శాటిలైట్ల మధ్య దూరం సుమారు 5 కిలో మీటర్లు. జనవరి 11న వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా, ఆదివారం నాటికి ఆ దూరం మొదట 15 మీటర్లకు తగ్గించారు. ఆ తర్వాత 3 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి హోల్డ్ చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించారు. సెన్సర్ల పనితీరును పరిశీలించి.. డాకింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. చివరికి గురువారం ఈ ప్రక్రియ విజయవంతమైంది.

మూడుసార్లు వాయిదాల తర్వాత..  
ఇస్రో ముందస్తు  ప్రణాళిక ప్రకారం శాటిలైట్ల డాకింగ్​ ప్రక్రియ ఈ నెల 7న జరగాల్సి ఉంది. అయితే, ఈ మిషన్​లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో డాకింగ్ ప్రక్రియపై ఇస్రో మరింత పరిశోధనలు చేసింది. ఈ షెడ్యూల్​ను జనవరి 9, ఉదయం 8 గంటలకు మార్చింది. అయితే, శాటిలైట్ల మధ్య దూరం ఊహించినదానికంటే ఎక్కువ ఉండటంతో డాకింగ్ ప్రక్రియను మళ్లీ జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. 11వ తేదీన డాకింగ్ ప్రక్రియకు ఇస్రో ప్రయత్నించింది. 

అయితే, కొన్ని క్షణాల ముందే ఇది ఆగిపోయింది. దీంతో ఇస్రో సైంటిస్టులు మరింత జాగ్రత్తగా ఈ మిషన్​లో అడ్జస్ట్​మెంట్లు చేశారు. రెండు శాటిలైట్లలో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక డాకింగ్ ప్రాసెస్​ను ప్రారంభించారు. రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని మెల్లిగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి విజయవంతంగా రెండు శాటిలైట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయి.

అంతరిక్ష ప్రయోగాలకు కీలక మెట్టు: ప్రధాని మోదీ
స్పేడెక్స్ మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు వివరించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. స్పేడెక్స్ మిషన్ ను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో సైంటిస్టులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కొనియాడారు.     

స్పేడెక్స్ మిషన్తో ఇవీ లాభాలు.. 
స్పేస్​లో మాడ్యూల్ వంటి నిర్మాణాలు, శాటిలైట్లలో ఫ్యూయెల్ నింపి వాటి మెయింటెంనెన్స్ చూసుకోవడం, సపోర్టింగ్ శాంపిల్ రిటర్న్ మిషన్స్, స్పేస్​లోని శిథిలాలు తొలగించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేదిశగా ఇండియా అడుగులు వేస్తున్నది. దీనికి ఈ టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుంది. గగన్​యాన్, చంద్రయాన్ మిషన్​లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చంద్రుడిపై ఆస్ట్రోనాట్లను దించడం, అక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చేందుకు డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రో స్పేడెక్స్‌‌‌‌ ప్రయోగం చేపట్టింది.