
- నాలుగుసార్లు వాయిదా పడిన తర్వాత ఐదోసారి విజయవంతం
- స్పేస్ లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్నికుల్ కాస్మోస్
- ఈ రాకెట్‌తో తక్కువ భూగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాల లాంచింగ్
- ఈ ఆర్థిక సంవత్సరంలోపు ఫస్ట్ ఆర్బిటల్ లాంచ్
న్యూఢిల్లీ: చెన్నైకు చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్.. సెమిక్రయోజనిక్ రాకెట్ ‘అగ్నిబాణ్’ ను గురువారం విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో తన సొంత లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 7.15 గంటలకు అగ్నికుల్ కాస్మోస్ ఈ టెస్ట్ ఫ్లైట్ నిర్వహించింది. ఇది సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోన్ స్ట్రేటర్ రాకెట్. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ రాకెట్ సాయంతో తక్కువ భూగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.
రెండు దశల్లో ఈ రాకెట్ ను ప్రయోగిస్తారు. 300 కిలోల పేలోడ్ ను రాకెట్ 700 కిలోమీటర్ల కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. లిక్విడ్, గ్యాస్ ప్రొపెల్లాంట్స్ తో కూడిన సెమిక్రయోజనిక్ ఇంజిన్ సాయంతో రాకెట్ నడుస్తుంది. ఈ రాకెట్ లో ఉపయోగించే ఇంజిన్ కు ‘అగ్నిలెట్’ అని పేరు పెట్టారు. ఈ ఇంజిన్ సబ్ కూల్డ్ ఆక్సిజన్ ను ఇంధనంగా వాడుకుంటుంది. ఇక సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోన్ స్ట్రేటర్ మిషన్ ను ఒకే దశలో లాంచ్ చేస్తారు. కాగా.. ఒక ప్రైవేటు సంస్థ రాకెట్ ప్రయోగం చేపట్టడం ఇది రెండోసారి. అంతరిక్షంలోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ నిలిచింది.
అగ్నికుల్ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో సైంటిస్టులు వీక్షించారు. ఈ మిషన్ కు సంబంధించిన లక్ష్యాలను సాధించామని అగ్నికుల్ కాస్మోస్ ట్విటర్ లో తెలిపింది. ‘‘దేశీయంగా అగ్నికుల్ రాకెట్ ను డిజైన్ చేశాం. ప్రపంచంలోనే మొదటి సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్ ను ఇందులో ఉపయోగించాం. అలాగే సెమిక్రయోజనిక్ ఇంజిన్ తో దేశంలోనే ఇలాంటి ప్రయోగం నిర్వహించడం ఇదే మొదటిసారి” అని అగ్నికుల్ స్టార్టప్ వెల్లడించింది. కాగా, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఎయిరోస్పేస్ 2022 నవంబర్ లో సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్’ ను ప్రయోగించింది.
నాలుగుసార్లు వాయిదా..
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం అంతకుముందు నాలుగుసార్లు వాయిదా పడింది. మార్చి 22, ఏప్రిల్ 6, ఏప్రిల్ 7, మే 28న అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉన్నా వివిధ సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. ఎట్టకేలకు ఐదోసారి విజయవంతమైంది. అగ్నిబాణ్ రాకెట్ విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ .. అగ్నికుల్ కాస్మోస్ టీమ్ కు అభినందనలు తెలిపారు. స్పేస్ స్టార్టప్ లు, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేలా, దేశంలో వైబ్రెంట్ స్పేస్ ఎకోసిస్టమ్ ను క్రియేట్ చేసేలా ఈ ప్రయోగం ఇస్రో సైంటిస్టులకు స్పూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక, అగ్నిబాణ్ లాంచ్ వెహికల్ ను ఐఐటీ మద్రాస్ ఇన్ క్యుబేటెడ్ స్టార్టప్ అభివృద్ధి చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లాంచింగ్
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మొదటి ఆర్బిటల్ లాంచ్ ను చేపట్టి భూగ్రహ కక్ష్య చుట్టూ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని అగ్నికుల్ కాస్మోస్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మా బృందం ఎంతో కష్టపడి అగ్నిబాణ్ రాకెట్ ను తయారు చేసింది. వెయ్యి గంటల పాటు సమీక్షలు చేసి ప్రాజెక్టును పూర్తిచేశాం. ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సైంటిస్టులు కూడా మాకు సహకారం అందించారు” అని రవిచంద్రన్ పేర్కొన్నారు.