క్లోజ్డ్బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి(మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం ఎనిమిది అలసంద విత్తనాలను అంతరిక్షంలోకి పంపించి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది. అంతరిక్షంలో విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించిన క్రాప్స్ అనే వ్యవస్థను కూడా ఇందులో నింగిలోకి పంపించనున్నారు. దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలు, స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం 24 ప్రయోగాలను పీఎస్ఎల్వీ ఆర్బిటర్ ఎక్స్పర్మెంట్ మాడ్యూల్ ద్వారా చేపట్టనున్నారు.
ఇందు కోసం డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ–సి60 మిషన్ ద్వారా భూకక్ష్యలోకి చేజర్, టార్గెట్ అనే రెండు శాటిలైట్లను ఇస్రో ప్రవేశపెట్టనున్నది. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షించనున్నారు. విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ప్లాంట్ స్టడీస్(క్రాప్స్) అనే పేలోడ్ వ్యవస్థను రూపొందించింది.
అమిటీ విశ్వవిద్యాలయం(ముంబయి) అభివృద్ధి చేసిన అమిటీ ప్లాంట్ ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్ (ఏపీఈఎంఎస్) ద్వారా సూక్ష్మ గురత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షిస్తారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి శాస్త్రవేత్తలు తీసుకురానున్నారు.
ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ) రూపొందించిన డెబ్రీ క్యాప్చర్ రోబోటిక్ మానప్యులేటర్ కక్ష్యలో శకలాలను ఒడిసిపడుతుంది. ముంబయికి చెందిన మనస్తు స్పేస్ స్టార్టప్ వ్యోమ్–2యూ గ్రీన్ ప్రో పల్సన్ థ్రస్టర్ను పంపుతున్నది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, కొన్ని పదార్థాలతో కూడిన మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వ్యోమనౌకల్లో వాడుతున్న హైడ్రజీన్కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థ ఇంధనాన్ని అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం.
ఈఎస్ఏతో ఇస్రో ఒప్పందం
వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)తో భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్షంలో మానవ నివాస ఏర్పాట్లలో అంతరిక్ష పరిశోధనల్లో పరస్పరం సహకరించుకుంటాయి.
వ్యోమగాములకు శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌకర్యాల వినియోగం, మానవ, బయో మెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాల్లో కలిసి పనిచేస్తాయి.