ఇటీవల కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో..శాటిలైట్ టెక్నాలజీలో మరో ముందడుగు వేస్తోంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV- D3ప్రయోగించేందుకు సిద్దమవుతోంది. ఈ శాటిలైట్ వెహికల్ లో సరికొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీగా ఉంది. ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది శాటిలైట్ టెక్నాలజీలో ఇస్రో సాధిస్తున్న పురోగతిని హైలైట్ చేస్తుంది.
EOS -08 శాటిలైట్ మూడు కీలక పేలోడ్ లను మోసుకెళ్తుంది. ఇందులో మిడ్ వేవ్ IR(MIR) , లాంగ్ వేవ్ IR(LWIR) లో చిత్రాలను సేకరించేందుకు రూపొందించిన ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ పేలోడ్( EOIR) ఉంటుంది. ఇది రాత్రి పగలు పనిచేస్తుంది. విపత్తులు, పర్యావరణం పర్యవేక్షణ, అగ్నిని గుర్తించడం, అగ్నిపర్వత పేలుళ్లు వంటివి గుర్తించడం, పారిశ్రామిక విపత్తులపై సమాచారం అందిస్తుంది.
ఇందులోని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రీ ఫ్లక్టోమెట్రీ పేలోడ్ (GNSS-R) సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనా, హిమాలయ ప్రాంతంపై క్రియోస్పియర్ అధ్యయనం, వరదలను గుర్తించడంక, లోతట్టు ప్రాంత జలాలను గుర్తించడం కోసం GNSS-R ఆధారిత రిమోట్ సెన్సింగ్ ను ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
EOS-08 ఉపగ్రహం 37.4° వంపుతో 475 కి.మీ ఎత్తులో వృత్తాకార తక్కువ భూమి కక్ష్య (LEO)లో పనిచేసేలా రూపొందించబడింది. ఇది సంవత్సరం కాలం పాటు మిషన్ ను కొనసాగిస్తుంది. దీని బరువు 175.5 కిలోలు. EOS-08 అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో కమ్యూనికేషన్, బేస్‌బ్యాండ్, స్టోరేజ్ , పొజిషనింగ్ (CBSP) ప్యాకేజీ అని కూడా పిలువబడే ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ సిస్టమ్ కూడా ఉంది.