ఇకపై అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్​గా కాల్స్

ఇకపై అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్​గా కాల్స్
  • అమెరికన్ కంపెనీకి చెందిన శాటిలైట్ ను పంపనున్న ఇస్రో 
  • ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీహరికోట నుంచి ప్రయోగం  
  • భారత్ నుంచి అమెరికాకు చెందిన భారీ శాటిలైట్ పంపడం ఇదే ఫస్ట్ టైం 

న్యూఢిల్లీ: ఇకపై అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్​గా కాల్స్ చేసి మాట్లాడొచ్చు. టెలీకమ్యూనికేషన్లలో విప్లవాత్మకమైన ఈ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు స్పేస్ నుంచి ఫోన్ కాల్ సర్వీసులను నిజం చేసేందుకు అమెరికన్ కంపెనీ తయారు చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ శాటిలైట్​ను లాంచ్ చేసేందుకు ఇస్రో సైంటిస్టులు కసరత్తు చేస్తున్నారు. శాటిలైట్ టెలిఫోనీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ఇస్రోతో కలిసి అమెరికన్ సైంటిస్టులు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన చిన్నపాటి శాటిలైట్​లను మాత్రమే ఇండియా నుంచి ఇస్రో ప్రయోగించింది. కానీ.. కమ్యూనికేషన్స్ కోసం వినియోగించే భారీ శాటిలైట్‌‌ ను భారత్ నుంచి ప్రయోగించనుండటం ఇదే తొలిసారి కానుంది. 

శాటిలైట్ నుంచి అందే సిగ్నల్స్‌‌ను వాడుకొని భూమి మీదున్న స్మార్ట్ ఫోన్ యూజర్లతో డైరెక్ట్​గా మాట్లాడుకునేందుకు అవసరమైన భారీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను ఇస్రో ప్రయోగించనుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ప్రకటించారు. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘ఏఎస్‌‌టీ స్పేస్ మొబైల్’ కంపెనీకి చెందిన ‘బ్లాక్ 2 బ్లూ బర్డ్’ శాటిలైట్‌‌‌‌ను ఇస్రో ప్రయోగించనున్నదని ఆయన తెలిపారు. కమ్యూనికేషన్స్ శాటిలైట్.. స్మార్ట్ ఫోన్లలో వాయిస్ కమ్యూనికేషన్​ను ఎనేబుల్ చేస్తుందని వివరించారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌‌ఎస్‌‌ఐఎల్ తో ‘ఏఎస్‌‌టీ స్పేస్ మొబైల్’ కంపెనీ డీల్ కుదుర్చుకున్నదని చెప్పారు. 

శాటిలైట్ బరువు 6 వేల కిలోలు

‘బ్లాక్ 2 బ్లూబర్డ్’ అనే ఈ అమెరికన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్.. 5జీ బ్రాడ్‌‌బ్యాండ్ సిగ్నల్స్‌‌ను అందించేందుకు వీలుగా దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది. ఈ ఉపగ్రహానికి దాదాపు 64 చదరపు మీటర్ల సైజులో భారీ యాంటెనా ఉంటుంది. అంటే సగం ఫుట్​బాల్ గ్రౌండ్ అంత ఉంటుందన్నమాట. దీని బరువు దాదాపు 6 వేల కేజీలు. ఈ ప్రయోగం కోసం ఇస్రో  బాహుబలి రాకెట్ జీఎస్‌‌ఎల్‌‌వీని ఉపయోగించనున్నది. శ్రీహరికోట నుంచి శాటిలైట్​ను ప్రయోగించనున్నారు. ఇది సక్సెస్ అయ్యాక.. బ్లాక్ 2 బ్లూబర్డ్ శాటిలైట్‌‌లోని టెక్నాలజీని వాడుకొని అమెరికాలో శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్స్ సర్వీసులను ఏఎస్‌‌టీ స్పేస్ మొబైల్ కంపెనీ ప్రారంభించనున్నది. ఆ తర్వాత విడతల వారీగా ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరింపజేసేందుకు సదరు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అడవులు, సముద్రం  తేడా లేకుండా ప్రపంచంలోని ప్రతి మూలలో మొబైల్ నెట్‌‌వర్క్‌‌ అందించడం ఈ టెక్నాలజీ ఉద్దేశమని ఆ కంపెనీ వెల్లడించింది.  

ఇక అన్నీ ‘శాటిలైట్’ ఫోన్లే.. 

తమ సర్వీసును ఉపయోగించుకుంటున్న యూజర్లందరూ.. త్వరలో శాటిలైట్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని ఏఎస్​టీ స్పేస్ మొబైల్ సీఈవో ఆబెల్ అవెల్లన్ తెలిపారు. స్పేస్​లో ఉన్నవాళ్లతో లేదంటే నేరుగా స్పేస్ ద్వారా ఒక స్మార్ట్ ఫోన్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ కు కాల్ మాట్లాడాలంటే.. శాటిలైట్ బేస్డ్ ఇంటర్​నెట్, వాయిస్ ప్రొవైడర్ల వద్ద స్పెషల్ హ్యాండ్​సెట్లు లేదంటే స్టార్ లింక్ కంపెనీ అందించే స్పెషల్ టెర్మినల్స్ అవసరమని వివరించారు. కానీ తమ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయితే.. ఇవేవీ అవసరం ఉండవన్నారు. అంటే.. బ్లాక్ 2 బ్లూ బర్డ్ సేవలు అందుబాటులోకి వస్తే.. ఆ సేవలు వినియోగించే స్మార్ట్ ఫోన్లన్నీ ఒకరకంగా శాటిలైట్ ఫోన్ల మాదిరిగానే పని చేస్తాయన్నారు.