
- మిషన్ పూర్తయిందని ఇస్రో ప్రకటన
- స్పేస్ డాకింగ్ లో సత్తా చాటిన 4వ దేశంగా ఇండియా
- గగన్ యాన్, చంద్రయాన్ 4 దిశగా ముందడుగు
- రేపటి నుంచి మరిన్ని ప్రయోగాలకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్(స్పేడెక్స్) సక్సెస్ అయింది. స్పేడెక్స్ 01, స్పేడెక్స్ 02 శాటిలైట్లను ఇస్రో సైంటిస్టులు గురువారం విజయవంతంగా అన్ డాకింగ్ చేశారు. ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇదొక చారిత్రాత్మక విజయమని ఇస్రో పేర్కొన్నది. రెండు శాటిలైట్ల అన్ డాకింగ్ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు, చంద్రయాన్- 4, గగన్‌యాన్ సహా భవిష్యత్‌లో చేపట్టే మరెన్నో ప్రయోగాలకు స్పేడెక్స్ మిషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో ప్రకటించింది.
అనుకున్న విధంగానే క్యాప్చర్ లివర్ 3 రిలీజ్ అయిందని.. రెండు శాటిలైట్లకు డీ -క్యాప్చర్ కమాండ్ ఇవ్వడం ద్వారా డీ -డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి స్పేస్ డాకింగ్ మిషన్‌తో మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, స్పేడెక్స్ మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభినందనలు తెలియజేశారు.
స్పేడెక్స్ మిషన్ విజయం.. ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. ఇస్రో చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. అసాధ్యాన్ని ఇస్రో సైంటిస్టులు సుసాధ్యం చేశారని తెలిపారు. డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు విజయవంతంగా పూర్తి చేశాయని వివరించారు. ఇండియన్ స్పేస్ స్టేషన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు మార్గాన్ని సుగమం చేసిందని తెలిపారు. రెండు శాటిలైట్లకు డీ -క్యాప్చర్ కమాండ్ ఇవ్వడంతో విజయవంతంగా డీ డాకింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు.
మిషన్ సాగింది ఇలా..
గతేడాది డిసెంబర్ 30న రాత్రి 10 గంటల 15 సెకండ్లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని ఇస్రో సైంటిస్టులు చేపట్టారు. ఈ మిషన్‌లో భాగంగా సైంటిస్టులు.. పీఎస్ఎల్వీ సీ–60 ద్వారా స్పేడెక్స్ 01 (ఛేజర్), స్పేడెక్స్ 02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. శాటిలైట్ వెహికల్ పీఎస్ఎల్వీ సీ60.. ఛేజర్, టార్గెట్‌ను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు శాటిలైట్లను డాకింగ్, అన్ డాకింగ్ చేసేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధమయ్యారు. సాంకేతిక కారణాలతో రెండు సార్లు డాకింగ్ ప్రక్రియను వాయిదా వేశారు.
ఛేజర్, టార్గెట్ మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ.. జనవరి 16న డాకింగ్ ప్రక్రియను విజయంతంగా కంప్లీట్ చేశారు. తాజాగా ఛేజర్, టార్గెట్‌ను అన్ డాకింగ్ చేసి స్పేడెక్స్ మిషన్‌ను మొత్తాన్ని సక్సెస్ చేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన ఇండియా చేరింది. స్పేడెక్స్ టెక్నాలజీ కలిగి ఉన్న నాలుగో దేశంగా ఇండియా అవతరించింది. కాగా, ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు 220 కిలోల వరకు ఉంటుంది. భూమి నుంచి సుమారు 470 కిలో మీటర్ల ఎత్తులో ఈ డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియ చేపట్టారు.
స్పేడెక్స్ మిషన్‌తో ఏం లాభం..?
స్పేస్‌లో నిర్మాణాలు, శాటిలైట్లలో ఫ్యూయెల్ నింపి వాటి మెయింటెనెన్స్ చూసుకోవడం, సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మిషన్స్, స్పేస్‌లోని శిథిలాలు తొలగించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా ఇండియా అడుగులు వేస్తున్నది. దీనికి ఈ టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుంది. గగన్‌యాన్, చంద్రయాన్ మిషన్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రుడిపై ఆస్ట్రోనాట్లను దించడం, అక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చేందుకు డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం చేపట్టి విజయం సాధించింది.