భూమి అడుగడుగూ ఇక ఆ ఉపగ్రహం కనుసన్నల్లో ఉండనుంది. అణువణువూ నిఘా అంచున ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా భూపరిశీలన (నిఘా) ఉపగ్రహం రిశాట్2బీని భూ కక్ష్యకు 557 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టింది. బుధవారం శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 5.30 గంటలకు చేసిన పీఎస్ఎల్వీ సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ప్రయోగంతో ఇస్రో నిఘా పేరిట మరో చరిత్ర రాసింది. నిఘా, వ్యవసాయం, అటవీ సంరక్షణ, విపత్తు నిర్వహణ వంటి వాటికి రిశాట్ 2బీ ఉపగ్రహం సాయపడుతుంది. ప్రయోగం ప్రారంభమైన 15 నిమిషాల 30 సెకన్లకు ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. 2009లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రిశాట్ 2 స్థానంలో ఈ కొత్త ఉపగ్రహం పనిచేస్తుంది. ఈ ఉపగ్రహంతో పాటు మరో 354 ఉపగ్రహాలనూ పీఎస్ఎల్వీ నింగిలోకి మోసుకెళ్లింది. మొత్తం 50 టన్నుల బరువును ఎత్తింది.
మబ్బులున్నా పనాగదు….
రిశాట్ 2బీకి అమర్చిన సింథటిక్ అపర్చర్ రాడార్ భూమిని కచ్చితత్వంతో స్పష్టమైన ఫొటోలు తీస్తుంది. మబ్బులు పట్టిన వాతావరణంలోనూ ఆ రాడార్ సమర్థంగా పనిచేస్తుంది. ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ముఖ్యంగా సైన్యానికి నిఘా కోసం చేదోడుగా ఉంటుంది. దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. 3.6 మీటర్ల మలవలేని రేడియల్ రిబ్ యాంటెన్నాని దీనికి పెట్టారు. టెర్రరిస్టు క్యాంపులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన రిశాట్2 కన్నా ఇంకా సమర్థంగా రిశాట్ 2బీ పనిచేస్తుంది. ప్రయోగంపై మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ కే శివన్ ప్రయోగం వివరాలను వెల్లడించారు. ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఇతర ఉపగ్రహాలు, విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపినట్టు చెప్పారు. దేశీయంగా తయారు చేసిన విక్రమ్ ప్రాసెసర్, తక్కువ ధరతో తయారు చేఉసిన ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌లను నింగిలోకి చేర్చామన్నారు. ఆ రెండు పేలోళ్లు చాలా ముఖ్యమన్నారు. ప్రయోగానంతరం ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నియంత్రణలోకి తీసుకుందని శివన్ చెప్పారు. జూలైలో చేయబోయే చంద్రయాన్ 2 ప్రయోగం ఇండియాకు ల్యాండ్‌మార్క్ ప్రయోగం అవుతుందన్నారు. ఇస్రో చేపట్టిన చాలా సంక్లిష్టమైన ప్రయోగం చంద్రయాన్ 2 అని చెప్పారు. జూలై 9 – 16 మధ్య ప్రయోగం చేస్తామని, సెప్టెంబర్ 6 నాటికి చంద్రుడిపై రోవర్, ల్యాండర్ దిగుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తిరిగి వాడుకునే లాంచ్ వెహికిల్ రెండో డెమో ఇస్తామన్నారు. మరో 18 నెలల్లో రిశాట్ బీఆర్1, రిశాట్2బీఆర్1లనూ ప్రయోగిస్తారని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం విజయవంతంగా చేయడం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు. ‘‘మళ్లీ మళ్లీ ఇండియా గర్వపడే ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాలే ఆకాశంలో మన కళ్లలా ఉంటాయి” అని సీతారామన్ ట్వీట్ చేశారు.
కెమెరా ఫ్లాష్‌లా రిశాట్2బీ….
కెమెరాకుండే ఫ్లాష్లైట్లా ఈ రిశాట్ 2బీ ఉపగ్రహం పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఓ వస్తువుపై ఫ్లాష్ లైట్వెలుతురు పడి స్పష్టంగా కనిపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ రిశాట్2బీలోని సింథటిక్ అపర్చర్ రాడార్ కూడా ఇలాగే పనిచేస్తుంది. సెకనుకు వందలాది రేడియో సిగ్నళ్లను టార్గెట్ (భూమి) వైపు పంపుతుంది. ప్రతిబింబించిన సిగ్నళ్లను రేడియో ఇమేజ్‌గా అది సృష్టిస్తుంది. ఆ రేడియో ఇమేజ్ను కంప్యూటర్ల ద్వారా అసలైన ఫొటోగా తయారు చేస్తారు. మబ్బులు పట్టినా, వర్షం వచ్చినా, దుమ్మ, ధూళి కమ్మేసినా స్పష్టమైన చిత్రాలను ఉపగ్రహం తీయగలుగుతుంది.