అది 2019 సెప్టెంబర్. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయవంతం అవుతుందని సైంటిస్టులతో పాటు యావద్దేశమంతా ధీమాతో ఉంది. కానీ, జాబిల్లి ఉపరితలానికి 7.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నపుడు ల్యాండర్ కూలిపోయింది. దీంతో నాటి ఇస్రో చైర్మన్, చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ శివన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు.
ఆ సమయంలో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శివన్ వద్దకు వెళ్లి ఓదార్చారు. అధైర్యపడవద్దని, నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని మోదీ ప్రోత్సహించారు. ఆ భావోద్వేగ క్షణాలను యావద్దేశం నాడు లైవ్ లో చూసింది. ఇప్పటికీ నాటి జ్ఞాపకాలు దేశ ప్రజల మదిలో అలాగే ఉన్నాయి. మళ్లీ నాలుగేళ్లకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతంగా జాబిల్లి ఉపరితలంపై సేఫ్ గా ల్యాండయి రికార్డు సృష్టించింది. పడిపోయిన చోటే గెలిచి ఇస్రో సైంటిస్టులు చరిత్ర సృష్టించారు.
గతం నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు..
చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి ఇస్రో సైంటిస్టులు త్వరగానే కోలుకున్నారు. నాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొన్నారు. ఫెయిల్యూర్ కు దారితీసిన ప్రతీ ఒక్క కారణంపైనా అధ్యయనం చేసి చంద్రయాన్ 3 మిషన్ చేపట్టారు. చంద్రుడిపై ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ కు ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా తట్టుకొని సేఫ్గా ల్యాండ్ అయ్యేలా ల్యాండర్ ను తీర్చిదిద్దారు. విక్రమ్ కు మరింత స్వేచ్ఛ ఇచ్చారు.
ల్యాండర్ లో రెండు ఆన్ బోర్డ్ సాఫ్ట్ వేర్ లు ఏర్పాటు చేశారు. చంద్రయాన్ 2 ల్యాండింగ్ కు 500 మీటర్ల పొడవు, 500 మీటర్ల వెడల్పు ప్రదేశాన్ని గుర్తించగా.. చంద్రయాన్ 3కి ల్యాండింగ్ ప్రదేశాన్ని పెంచారు. విక్రమ్ ల్యాండర్ కు 4 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పు గల ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దీంతో విక్రమ్ ల్యాండింగ్ ఈజీ అయిపోయింది. ఇక చంద్రయాన్ 3కి మరింత ఇంధనం సమకూర్చారు.
ల్యాండింగ్ ప్రదేశంలో, ల్యాండింగ్ టైంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, అడ్డంకులు ఏర్పడినా ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ల్యాండర్ గుర్తించే వరకూ అదనంగా ఇంధనం సమకూర్చారు. అలాగే ల్యాండర్ పవర్ ఫుల్ కెమెరాను అమర్చారు. ల్యాండింగ్ ప్రదేశాన్ని మరింత కచ్చితంగా గుర్తించేందుకు ఈ కెమెరా ఉపయోగపడింది.