ఆడ బిడ్డ అని తేలితే అబార్షన్...కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న లింగ నిర్ధారణ టెస్టులు

ఆడ బిడ్డ అని తేలితే అబార్షన్...కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న లింగ నిర్ధారణ టెస్టులు
  • పోలీసుశాఖ సీరియస్​
  • రాజంపేటలో ముఠా పట్టివేత
  • దర్యాప్తు చేపట్టిన అధికారులు

గర్భిణి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులు కొన్ని టెస్టులు చేస్తారు. అయితే ఆ వివరాలు బయటకు వెల్లడించకూడదు. కొందరు కాసులకు కక్కుర్తిపడి పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో ముందుగాను తెలియజేస్తున్నారు. దీంతో ఆడబిడ్డ వద్దనుకున్నవారు అబార్షన్​ చేయించుకుంటున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా ఇళ్లకు వెళ్లి లింగనిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. 

కామారెడ్డి, వెలుగు:  అక్రమ లింగ నిర్ధారణ టెస్టుల వ్యవహారం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. అక్రమ టెస్టులు చేస్తున్న కేంద్రాలపై ఇటీవల  వరుస దాడులు చేస్తున్నా దందా ఆగట్లేదు. అడ్డాలు మార్చి గుట్టు చప్పుడు కాకుండా దందాను సాగిస్తున్నారు.  ఈ వ్యవహారంపై పోలీసు శాఖ ఫోకస్​ చేసింది. లింగ నిర్ధారణ టెస్టులు ఎక్కడ జరుగుతున్నాయి?  టెస్టుల్లో ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు ఎక్కడ చేస్తున్నారనే దానిపై  విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల  రాజంపేటలో  లింగనిర్ధారణ టెస్టులు చేస్తున్న  ముఠాను పట్టుకున్నారు.  ఈ ముఠా హాస్పిటల్స్​లో కాకుండా  ఇండ్లకు వెళ్లి   టెస్టులు చేస్తున్నట్టు తెలిసింది. ఈ టెస్టుల వ్యవహారం బహిరంగంగా జరుగుతుండటం గమనార్హం.  లింగ నిర్ధారణ టెస్టులు, అబార్షన్ల కోసం కామారెడ్డికి  జిల్లా వాసులే కాకుండా పొరుగు జిల్లాలు, మహారాష్ర్ట, కర్నాటక నుంచి వస్తున్నారు.  ప్రస్తుతం అక్రమ లింగ నిర్ధారణ టెస్టులకు కామారెడ్డి  కేంద్రంగా మారింది. 

వివరాల వెల్లడి

గర్భం దాల్చిన తర్వాత కొందరు అనుమానంతో పుట్టబోయేది ఆడబిడ్డ? మగబిడ్డ? అని  లింగ నిర్ధారణ టెస్టు చేయిస్తున్నారు. ఈ టెస్టు చేయడం చట్టరీత్యా నేరం. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గర్భిణికి టెస్టులు చేసినా బయటకు వెల్లడించకూడదు.  దీనిని ఆసరాగా తీసుకొని అక్రమ దందాకు  తెరతీశారు. మూడేళ్ల క్రితం స్టేట్​హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు​ రెక్కీ నిర్వహించి టెస్టులు చేస్తున్న వారిని పట్టుకొని హాస్పిటల్​ను సీజ్​ చేశారు.  కొద్ది రోజులు ఈ దందా నిలిచి మళ్లీ  షూరు అయ్యింది.  సీజ్​ చేసిన హాస్పిటల్ నిర్వాహాకులే మరో పేరుతో కొత్త హాస్పిటల్ లో టెస్టులు చేస్తున్న వ్యవహారం  ఓ శిశువు అమ్మకంతో బయటపడింది.  రాజంపేట మండల కేంద్రంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్​ఇంట్లో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టి  వారిని పట్టుకున్నారు. సెకండ్​ హ్యాండ్​లో స్కానింగ్​ మిషన్​ కొని మూడేళ్లుగా టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేస్తున్న ఆర్ఎంపీతోపాటు, ఇందుకు సహకరించిన మరో ఇద్దరు ఆర్ఎంపీలు,  టెస్టింగ్​మిషన్​ అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.  ఈ దందాలో మరి కొందరు ఉన్నారని పోలీసు ఆఫీసర్లు వెల్లడించారు. 

కొనసాగుతున్న  దర్యాప్తు 

జిల్లాలో 26 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి.  అబార్షన్​ చేయటానికి  కామారెడ్డిలో  రెండు హాస్పిటల్స్​కు మాత్రమే హెల్త్​ డిపార్ట్​మెంట్​ పర్మిషన్​ ఉంది.   కానీ, జిల్లాలో ఇష్టారాజ్యంగా లింగనిర్ధారణ టెస్ట్​ల దందా కొనసాగుతోంది. ఇటీవల రాజంపేటలో పట్టుబడిన ముఠాను పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.  టెస్టుల వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు.  లింగనిర్ధారణ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకొని దర్యాప్తు చేస్తే దందాకు అడ్డుకట్టపడే అవకాశముంది.  టెస్టుల్లో ఆడ పిల్ల అని తేలగానే కొందరు అబార్షన్​చేయించినట్లు తెలిసింది.