- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని క్యాండిడేట్లపై వరుస లీకులు
- చాన్స్ దక్కనోళ్ల పరిస్థితిపై పలు రకాల ప్రచారాలు
- ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో నేతలు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఫలానా వాళ్లకు టికెట్ ఖాయమంటూ పార్టీ హైకమాండ్ నుంచే వరుస లీకులు వస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో కలిపి మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఒక్కోచోట బీఆర్ఎస్ నుంచి ఇద్దరికంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి.. తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు, పోటీచేసి ఓడిన బీఆర్ఎస్అభ్యర్థులు, కొత్తగా టికెట్ ఆశిస్తున్నవారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ల ద్వారా సీటు కన్ఫర్మేషన్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.
ఇదే టైంలో కొందరికి టికెట్ఓకే అన్నట్లు హైకమాండ్లీకులు ఇస్తుండడంతో మిగిలినవారు లోలోపల రగిలిపోతున్నారు. టికెట్ దక్కని వాళ్లు ఏం చేయబోతున్నారు, హైకమాండ్అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరు ప్రత్యర్థి పార్టీ మెయిన్లీడర్లతో టచ్‌లోకి వెళ్లారని టాక్ నడుస్తోంది. మరికొందరు ఇంకా తమకు పార్టీపై నమ్మకం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లో ఉన్న ఇద్దరు ముఖ్యనేతలు చివరి నిమిషంలో కాంగ్రెస్‌తరఫున పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టు టాక్నడుస్తోంది.
ఇల్లెందులో సిట్టింగ్ కు నో చాన్స్!
ప్రధానంగా పాలేరు, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు బీఆర్ఎస్సీట్లపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఇల్లెందులో బీఆర్ఎస్నుంచి పోటీ చేసి ఓడిన కోరం కనకయ్య ఇటీవల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఇల్లెందులో కాంగ్రెస్‌నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ఇవ్వరని చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె, ప్రొఫెసర్గుమ్మడి అనురాధ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోరం కనకయ్యను బీఆర్ఎస్ లోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన తిరిగొస్తే ఇల్లెందు బీఆర్ఎస్అభ్యర్థిగా కనకయ్యను ఫైనల్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
కొత్తగూడెంలో వింత పరిస్థితి
కొత్తగూడెంలో కొంత ప్రత్యేక పరిస్థితి ఉంది. అనర్హత పిటిషన్ విషయంలో హైకోర్టు జలగం వెంకటరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో లంచ్‌కు పిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో జలగం వెంకటరావు పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆయనకు ఇప్పటికే లైన్ క్లియర్ అయిందని, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని జలగం అనుచరులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి వనమాకు బీఆర్ఎస్ టికెట్ ఓకే అని అంటున్నా, చివరి నిమిషంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయనకు కొత్తగూడెం ఇన్చార్జిగా కేసీఆర్బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఇదేనన్న టాక్వినిపిస్తోంది.
వైరాలోనూ అదే పరిస్థితి
ఇక వైరాలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు టికెట్అనుమానమేనని అంటున్నారు. 2018 ఎన్నికల్లో రాములు నాయక్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి, మాజీ ఎంపీ పొంగులేటి సపోర్టుతో గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో రాములునాయక్‌పై ఓడిపోయిన మదన్‌లాల్ కు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతను మంత్రి పువ్వాడ అజయ్‌కు అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ఏం చేస్తారో, పార్టీ మారతారా, లేక బీఆర్ఎస్హైకమాండ్ను నమ్ముకొని ఉంటారా అనేది సస్పెన్స్‌గా మారింది.
పాలేరులో నాలుగేండ్లుగా వర్గపోరు
పాలేరు సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య నాలుగేండ్లుగా వర్గపోరు నడుస్తోంది. ఇద్దరూ తమకే సీటు ఖాయమని ధీమాగా చెబుతున్నారు. పోటీలో నిలిచేది నేనే, గెలిచేది నేనే అంటూ కందాల రెండ్రోజుల కింద ఓ సభలో చెప్పగా, పాలేరు బరిలో ఉంటానంటూ రీసెంట్ గా తుమ్మల ప్రకటించారు. కందాలకు కేసీఆర్ భరోసా ఇచ్చారని తెలుస్తుండగా, తనకు చివరి నిమిషంలో అయినా టికెట్ దక్కుతుందన్న నమ్మకంలో తుమ్మల ఉన్నారు. అయితే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి, అవకాశం దొరక్కపోతే అప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో దిగే చాన్స్లేకపోలేదని సమాచారం. ప్రస్తుతం మాత్రం తొందరపడొద్దనేదే తుమ్మల అభిప్రాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.