ఎన్నికల ప్రచారాస్త్రంగా నిజాం షుగర్స్

ఎన్నికల ప్రచారాస్త్రంగా నిజాం షుగర్స్

మెదక్, వెలుగు : నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల అంశం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రచారాస్త్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీలు తాము  అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మూత పడ్డ నిజాం షుగర్స్​ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీలు ఇస్తున్నాయి. కేసీఆర్ ​మాట ఇచ్చి తప్పారని విమర్శిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్​పార్టీ మాత్రం ఈ విషయంలో నోరు విప్పడం లేదు.  

ఇదీ జరిగింది...

రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా బోధన్‌‌ సమీపంలోని శక్కర్‌‌ నగర్‌, జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి, మెదక్‌‌ జిల్లా మెదక్​మండలం మంబోజిపల్లిలోని నిజాం షుగర్​​ఫ్యాక్టరీలు 2002 సంవత్సరం వరకు బాగానే నడిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించింది. జాయింట్‌‌ వెంచర్‌‌గా ఫ్యాక్టరీలను నిర్వహించేందుకు డెల్టా పేపర్‌‌ మిల్‌‌ యాజమాన్యానికి అప్పగించింది. 2004 సంవత్సరంలో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభా సంఘం ఫీల్డ్​ విజిట్​ చేసింది. ఫ్యాక్టరీల స్థితిగతులు పరిశీలించి, చెరుకు రైతులు, కార్మికులతో మాట్లాడింది.  ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దుచేసి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో నివేదిక సమర్పించింది. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. 

వంద రోజుల్లోనే స్వాధీనం చేస్కుంటమన్న కేసీఆర్​ 

తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో ఫ్యాక్టరీలను ప్రభుత్వ స్వాధీనం చేసుకొని పూర్వవైభవం తీసుకువస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​ ప్రకటించారు.  ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఆరంభంలో ఫ్యాక్టరీల స్వాధీన ప్రక్రియ చేపట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫ్యాక్టరీల స్వాధీనానికి చర్యలు మొదలుపెట్టినా అడుగు ముందుకు పడలేదు.  

తుప్పుపట్టిన మెషినరీ..కార్మికుల వలసబాట 

ముడిసరుకు, నీటి కొరతతో ఫ్యాక్టరీలు నడపలేని పరిస్థితి ఉందని నిజాం దక్కన్‌‌ షుగర్స్​ లిమిటెడ్‌‌ (ఎన్డీఎస్‌‌ఎల్‌‌) మేనేజ్​మెంట్​బోర్డు 2015 డిసెంబర్​23న లే ఆఫ్‌‌ ప్రకటించింది. దీంతో మెట్​పల్లి, శక్కర్​నగర్​, మంబోజిపల్లి ఫ్యాక్టరీ యూనిట్లు మూతపడ్డాయి. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్​‌(ఎన్‌‌సీఎల్‌‌టీ) తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. మూతపడి ఎనిమిదేండ్లవుతుండడంతో వినియోగంలో లేక ఫ్యాక్టరీల్లోని మెషినరీ తుప్పుపట్టి పాడైపోయింది.

పెద్ద పెద్ద గోడౌన్లు వృథాగా మిగిలాయి. ఉద్యోగులు, కార్మికులు నివసించేందుకు నిర్మించిన బంగ్లాలు, క్వార్టర్లు, గెస్ట్​హౌజ్​లు శిథిలమవుతున్నాయి. ఫ్యాక్టరీ ఆవరణల్లో తుమ్మ చెట్లు మొలిచి చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి. సుమారు రూ.500 కోట్లకు పైగా విలువైన వందలాది ఎకరాల భూములు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఫ్యాక్టరీలు మూతపడడంతో ఉద్యోగాలు పోయి, ఉపాధి దొరక్క ఎంతోమంది కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు బతుకు దెరువుకోసం వలస బాట పట్టారు. మనోవేదనతో కొందరు కార్మికులు గుండెపోటుతో, మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు.  

ఎందుకు తెరిపించలే కేసీఆర్...

తమది రైతు ప్రభుత్వమని, రైతులకు ఎవరూ చేయనంత మేలు చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్​ షుగర్స్​ఫాక్టరీలను ఎందుకు తెరిపించడం లేదని కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నిస్తున్నాయి. మెదక్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో వీటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక మొత్తానికే మూత పడేలా చేశారని ఆరోపిస్తున్నాయి.

వేలాది మంది రైతులకు తీరని నష్టం కలిగించడంతోపాటు, వంద​లాది కార్మికులను రోడ్డున పడేశారని విమర్శిస్తున్నాయి. నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీలను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్​కు రైతులు గుణపాఠం చెప్పాలని కోరుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి. కాగా, ఫ్యాక్టరీల గురించి ఏం మాట్లాడినా అది తమకు మైనస్​ అవుతుందని భావిస్తున్న బీఆర్ఎస్​ ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు.