
- పట్దాదారులనే పరిగణలోకి తీసుకుంటున్న సర్కార్
- గైడ్ లై న్స్ లో తమ ప్రస్తావన లేదని ఆవేదన
నిర్మల్, వెలుగు: వీఆర్ఏల రెగ్యులరైజేషన్ వ్యవహారం ఆందోళనలకు కారణమవుతోంది. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులకు వీఆర్ఏలు రెవెన్యూ శాఖకు ఉపయోగపడ్తున్నారు. ఈవ్యవస్థ నిజాం కాలం నుంచి సుంకరి, నీరటిగా కొనసాగింది. ప్రధానంగా చెరువు తూముల ద్వారా పంట పొలాలకు నీరు వదలడం అలాగే చెరువులకు కాపలాగా ఉండడమే కాకుండా సర్కారీ వసూళ్లు సక్రమంగా చేయడం వీరి డ్యూటీ గా ఉండేది. కాలక్రమంలో గ్రామస్థాయిలో, రెవెన్యూ ఆఫీసుల్లో కూడా వీరు పని చేస్తు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సుంకరులుగా పిలిచే వీరిని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వీఆర్ఏలుగా మార్చారు.
ఇటీవల సీఎం కేసీఆర్ వీఆర్ఏలందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడమే గాకుండా ప్రభుత్వం జీవో నెంబర్ 81 పేరిట వీఆర్ఏలందరినీ వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా సర్దుబాటు చేసేందుకు జీవో సైతం జారీ చేసింది. దీని ప్రకారం వీఆర్ఏల అర్హతలను బట్టి వారిని రెగ్యులర్ ప్రాతిపదికన లాస్ట్ గ్రేడ్ సర్వీస్ తో బాటు రికార్డ్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు కూడా ఉద్యోగాలు కల్పించనున్నారు. వీఆర్ఏల రెగ్యులరైజేషన్ అలాగే వివిధ శాఖలలో వారి విద్యార్హతలను బట్టి పోస్టుల కేటాయింపునకు సంబంధించిన గైడ్‌లైన్స్ జారీ కావడంతో ఇస్సాదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పట్టాదారులు, ఇస్సాదారుల మధ్య వివాదం మొదలైంది.
వివాదం మొదలు..
నిర్మల్ జిల్లాలో రెండ్రోజుల నుంచి ఇస్సాదారులు తమను కూడా రెగ్యులరైజ్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం తహసీల్దార్ ఆఫీస్ ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అయితే తామే అసలుదారులమని తమకే రెగ్యులరైజేషన్ వర్తిస్తుందని పట్టాదారులు చెప్తున్నారు. పట్టాదారులతో సమానంగా ఓ కుటుంబంలోని వారసులుగా తాము పని చేస్తూ గుర్తింపు పొందామని చాలా యేండ్ల నుంచి తమకు వేతనాలు కూడా చెల్లించారని ఇస్సాదారులు స్పష్టం చేస్తున్నారు. ఇస్సాదారులకు సేత్ సింది నీరటిల వేతనాల రశీదు ప్రకారమే ఏళ్ల నుంచి వారికి నెల వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే వేతన చెల్లింపు రశీదులో మాత్రం అసలుదారు పేరు కూడా ఉండడంతో ప్రస్తుతం వారినే అసలు వీఆర్ఏలుగా గుర్తిస్తున్నారు. ఇస్సాదారులను కేవలం వారి వారసులుగానే పరిగణిస్తుండడంతో రెగ్యులరైజ్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. నిర్మల్ జిల్లాలో దాదాపు 600 మందికి పైగా వీఆర్ఏలు ఉండగా వారి ఇస్సాదారులుగా సుమారు 4వేల మందికి పైగా ఉంటారని చెప్తున్నారు.
గైడ్ లైన్స్ లో ప్రస్తావనేది?
పట్టాదారుల మాదిరిగా తమకు కూడా రెగ్యులరైజేషన్ కు అవకాశం కల్పించి పోస్టింగులు ఇవ్వాలని ఇస్సాదారులు కోరుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో సంబంధించిన గైడ్‌లైన్స్‌లో ఎక్కడ కూడా తమ ప్రస్తావన లేదని వాపోతున్నారు. తరతరాలుగా తమ ఇంటి పెద్దలు సుంకరులు, నీరటిగా పనిచేస్తూ వ స్తున్నారని అయితే రికార్డుల కోసం మాత్రం తమ కుటుంబంలోని ఒకరి పేరు మాత్రమే నమోదు చేశారంటున్నారు. తామందరం వంతుల వారీగా ఇస్సాదారుల పేరిట పనులు చేస్తున్నామని పేర్కొంటున్నారు. రికార్డుల్లో ఉన్న వీఆర్ఏల మాదిరిగానే తాము రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులమని చెప్తున్నారు. జీవోలో 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఇస్సాదారులకు కూడా అదే రకంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు..
మాకూ అవకాశం ఇవ్వాలే..
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో నియమిస్తుండడం మంచిదే. అయితే కేవలం పట్టాదారులనే కాకుండా ఇస్సాదారులకు కూడా అవకాశమివ్వాలే. యేండ్లుగా సుంకరి, నీరటి పేరిట రెవెన్యూలో పనిచేస్తున్నం. పట్టాదారులనే రెగ్యులరైజ్ చేసి మమ్ముల్ని పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు అవకాశం కల్పించాలే.
- గుజ్జరి సాగర్ ,ఇస్సాదార్,లక్ష్మణ చందా మండలం, నిర్మల్