గర్ల్స్ హాస్టల్​లో సీక్రెట్ కెమెరాలు .. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కలకలం

అమరావతి:  ఏపీలోని కృష్ణా జిల్లాలో సీక్రెట్ కెమెరాల ఇష్యూ కలకలం సృష్టించింది. ఎస్‌‌‌‌ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ లోని వాష్ రూంలో  సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిలు స్నానం చేస్తుండగా.. బట్టలు మార్చుకుంటుండగా  వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. హాస్టల్​లోని ఓ అమ్మాయే.. బాయ్స్ హాస్టల్​లో ఉండే ఫైనలియర్ స్టూడెంట్ విజయ్​తో కలిసి సీక్రెట్ కెమెరాలు అమర్చిందని పలువురు స్టూడెంట్లు ఆరోపించారు. దాదాపు 300  వీడియోలను ఇంత అని రేటు కట్టి ఇద్దరూ బయట అమ్మేశారని  చెబుతున్నారు. 

ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ మేనేజ్​మెంట్ పట్టించుకోకపోవడంతో  గురువారం అర్ధరాత్రి దాటాక స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. విజయ్ పై దాడి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు నిరసన కొనసాగింది. రంగంలోకి దిగిన పోలీసులు విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌‌టాప్, సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలేజీలో సీక్రెట్ కెమెరాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు. బాలికల హాస్టల్​లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని తెలిపారు.

 నిందితుల ల్యాప్‌‌టాప్, సెల్‌‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పోలీసులు పరిశీలించారన్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదని పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంతో  విద్యార్థులు శుక్రవారం ఆందోళన కంటిన్యూ చేశారు. 

విద్యార్థులకు ఏబీవీపీ విద్యార్థి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీ బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్థి, అతనికి సహకరించిన విద్యార్థినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు.

స్టూడెంట్ల సమక్షంలోనే తనిఖీలు

సీఎం ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్​ను గుర్తించే పరికరంతో హాస్టల్లో  దాదాపు 4 గంటలకుపైగా  అణువణువూ తనిఖీ చేశారు. ఎలాంటి హిడెన్ కెమెరా లభించలేదు. తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు.

పటిష్ట దర్యాప్తు చేపట్టండి: సీఎం చంద్రబాబు

కాలేజిలో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కాలేజీకి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్​లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.