బీజేపీ, కాంగ్రెస్​లో టికెట్ల లొల్లి.. ముథోల్ బీజేపీలో ముగ్గురి ప్రయత్నాలు

  • కాంగ్రెస్ కు కొత్త అభ్యర్థులు
  • ఖానాపూర్ బీజేపీలో ఇద్దరు హోరాహోరీ..
  •  ఆసక్తికరంగా ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థిత్వం
  • నిర్మల్ కాంగ్రెస్ లో ఐదుగురు ఆశావహులు

నిర్మల్, వెలుగు: రాజకీయ కేంద్రంగా నిలిచే నిర్మల్ ​జిల్లాలో టికెట్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముథోల్, ఖానాపూర్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ల కోసం నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్​ల నుంచి టికెట్ల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఈసారి అన్ని సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ తప్పదని జనాలు చర్చించుకుంటున్నారు.  

నువ్వా.. నేనా..

ముథోల్ సెగ్మెంట్​లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఖరారైన సంగతి తెలిసిందే. కాగా ఇక్కడి బీజేపీలో మాత్రం టికెట్ కోసం ముగ్గురు సీనియర్ నేతలు రేసులో ఉండబోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్​తో పాటు కొద్ది రోజుల క్రితం డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావు పటేల్ కూడా ఈసారి టికెట్ కోసం పోటీ పడనున్నారు. గత ఎన్నికల్లో రమాదేవి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలంటూ ఆమె పట్టుబడుతున్నారు. కాగా రాష్ట్ర అధిష్టానంతో తనకున్న పరిచయాలు, స్థానికంగా కార్యకర్తలతో ఉన్న సంబంధాల కారణంగా ఈసారి టికెట్​ తననే వరిస్తుందంటూ మోహన్ పటేల్ ధీమాగా ఉన్నారు. 

ఆ నమ్మకంతోనే ఆయన ఇంటింటికీ బీజేపీ పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇక రామారావు పటేల్ ఇప్పటికే టికెట్ విషయంలో తనకు అధిష్టానం హామీని ఇచ్చిందని తన సన్నిహితులకు చెప్పుకుంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురికీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో టికెట్ కేటాయింపు విషయం పార్టీ అధిష్టానానికి సవాల్​గా మారనుంది. ఒకరికి టికెట్ ఇస్తే మిగతా ఇద్దరు నేతల వైఖరి ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది.

ఖానాపూర్​లో పోటా పోటీ..

ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్​ను కాకుండా బీఆర్​ఎస్ అధిష్టానం కొత్త నేత జాన్సన్ నాయక్​కు టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానంటూ ఆమె బహిరంగంగానే చెప్తున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్టానం తనకు చేసిన అన్యాయాన్ని ఓటర్లకు వివరిస్తూ ఓటర్లలో సానుభూతిని పెంచుకుంటున్నారు. 

కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెడుమ బొజ్జూ ఈసారి తనకే టికెట్ వస్తుందంటూ ధీమాగా ఉన్నారు. రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడమే కాకుండా ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో పార్టీ తమ నేత వైపే మొగ్గు చూపుతుందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. వెడ్మ  బొజ్జు, రేఖా నాయక్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక్కడి బీజేపీలో మరింత ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. 

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పెంబి జడ్పీటీసీ భూక్య జానకి బాయి టికెట్ కోసం పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యక్రమ వేదికపై ఈ ఇద్దరు వాగ్వివాదానికి దిగడం తీవ్ర చర్చ చర్చకు దారితీసింది. గిరిజన మహిళా కోటలో టికెట్ తనకే దక్కుతుందంటూ జానకి బాయి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్​ నేతగా, ఎమ్మెల్యే, ఎంపీగా వ్యవహరించిన తనకే టికెట్​ రాబోతోందనంటూ రమేశ్ రాథోడ్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ తెగకు చెందిన నేత భీమ్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లోనూ ఆయన పార్టీ తరఫున పోటీ చేశారు.

నిర్మల్​లో కాంగ్రెస్​ నుంచి ఐదుగురు

జిల్లా కేంద్రమైన నిర్మల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఇప్పటికే అధిష్టానం ప్రకటించగా.. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోటీ దాదాపు ఖాయమైనట్లే. ఇతర నేతలెవరూ టికెట్ ఆశించకపోతుండడంతో ఆయనకే బీజేపీ అధిష్టానం టికెట్ ఖాయం చేయనుంది. అయితే  కాంగ్రెస్ నుంచి ఐదుగురు నేతలు రేసులో నిలవడంతో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఆసక్తి మొదలైంది. బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరిన సీనియర్ నేత శ్రీహరిరావుకు టికెట్ ఖాయమని ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి తో పాటు ఇద్దరు  సీనియర్ సీబీ నేత చించోలి రాజేశ్వర్, ఎంబడి రాజేశ్వర్ కూడా టికెట్ కోసం అప్లై చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్​ నుంచి ఇద్దరు పోటాపోటీగా..

ఇక ముథోల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిన్న మొన్నటి వరకు అభ్యర్థులే లేని పరిస్థితి ఉనప్పటికీ ప్రస్తుతం ఇద్దరు టికెట్​ రేసులో నిలిచారు. తెలుగుదేశం హయాంలో జడ్పీటీసీగా కొనసాగిన విజయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొన్నేండ్లుగా విదేశాల్లోనే ఉన్న ఆయన పోటీ చేసేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవలే పార్టీలో చేరిన డాక్టర్ కిరణ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ సంప్రదాయ ఓట్లు, మైనార్టీ ఓట్లతో గెలుపు సాధిస్తానే ధీమాతో ఉన్నారు.