- హనుమకొండ జిల్లా ఉనికిచెర్లలో 118 ఎకరాలు తీసుకున్న ‘కుడా’
- తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని భూసేకరణ!
- అవే రైతుల అంగీకార పత్రాలని చెప్తున్న వైనం
- రాత్రికిరాత్రే ఖనీలు పీకేసిన ఆఫీసర్లు
- మార్కింగ్ పూర్తి చేసి వెంచర్లకు ఏర్పాట్లు
- తామెట్లా బతకాలంటూ వాపోతున్న రైతులు
హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు: ల్యాండ్ పూలింగ్‌ను రైతులు వ్యతిరేకిస్తున్నా కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) తాను అనుకున్న పని చేసుకుంటూ పోతున్నది. గత ప్రభుత్వాలు పేదలకు అసైన్ చేసిన భూములను బలవంతంగా లాక్కొని గుట్టుచప్పుడు కాకుండా వాటిని సాఫ్ చేస్తున్నది. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద సర్వే నంబర్ 325/1 నుంచి 325/68 వరకు దాదాపు 118 ఎకరాల ల్యాండ్ ఉండగా.. ఆ మొత్తం భూమిని చదును చేసింది. రైతుల అంగీకారం లేనిదే ల్యాండ్ పూలింగ్ చేయబోమని చెబుతూనే.. సైలెంట్‌గా అక్కడి భూములను తీసుకుని వెంచర్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే వెంచర్లకు సంబంధించిన మార్కింగ్ కంప్లీట్ చేయగా, రెండ్రోజుల నుంచి ఆ భూమిలోని పొలాలు, ముళ్ల పొదలు, బండరాళ్లను తొలగిస్తున్నది. మరోవైపు కుడా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో 21,517 ఎకరాలు సేకరించేందుకు ప్లాన్ చేసింది. కానీ ఆ నోటిఫికేషన్‌లో ఎక్కడా ఉనికిచెర్ల గ్రామం పేరు లేదు. అంటే నోటిఫికేషన్ లేకుండానే ఉనికిచెర్లలో భూసేకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పెద్ద మొత్తంలో అసైన్డ్ ల్యాండ్ ఉండటం.. సహకరించే రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతల అండ ఉండటంతోనే రైతుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా కుడా పనులు చేసుకుపోతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం బాధిత రైతులు తమ పొలాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఎవరైనా మాట్లాడితే బెదిరింపులు
ఉనికిచెర్ల వద్ద అసైన్డ్ ల్యాండ్ సేకరించేందుకు కుడా నాలుగు నెలల నుంచే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జిల్లా స్థాయి ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి.. అక్కడి రైతుల వివరాలు సేకరించారు. తర్వాత అక్కడికి వచ్చిన రైతుల నుంచి తెల్లకాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. మరో నెలకు ధర్మసాగర్ ఎమ్మార్వో ఆఫీస్‌లో మీటింగ్ పెట్టి కొంతమంది నుంచి సంతకాలు సేకరించారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించి తాము సంతకాలు పెట్టినట్టుగా చూపిస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. రైతుల అంగీకారం లేకుండా ల్యాండ్ పూలింగ్ చేయబోమని చెప్పి.. ఇలా బలవంతంగా భూసేకరణ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోతున్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు అసైన్ చేసిన ల్యాండ్ గుంజుకుంటే తామెట్ల బతకాలని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే స్థానిక టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములను తీసుకుంటున్న ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఓ వైపు ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తుండగా, కుడా ఇలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతుండటం విమర్శలకు తావిస్తోంది.
రాత్రికిరాత్రే నాశనం చేశారు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మేం సాగు చేసుకుంటున్నాం. దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టి బోరు, డ్రిప్, కంచె ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండిస్తున్నా. రాత్రికిరాత్రే అక్కడున్న ఖనీలు అన్నీ కూలగొట్టి, మొత్తం నాశనం చేశారు. ఆఫీసర్లను అడిగితే ఏమీ చెప్పడం లేదు.
- తాటిపాముల కేదారి, రైతు, ఉనికిచెర్ల
మేమెట్ల బతకాలె?
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకోకపోగా.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న భూమిని గుంజుకుంటే మేం ఎట్లా బతకాలే.
- మైస సమ్మయ్య, రైతు, ఉనికిచెర్ల