కాగితాలు దాటని కోణార్క్​ సేఫ్టీ

కాగితాలు దాటని కోణార్క్​ సేఫ్టీ

కోణార్క్​ సూర్య దేవాలయాన్ని 800 ఏళ్ల క్రితం కట్టారు. ఒడిశా ఐకాన్​​గా నిలుస్తున్న ఈ టెంపుల్​ ఇప్పుడు చాలా వరకు శిధిలమైంది. రేపో మాపో కూలిపోయే స్థితికి చేరింది. దీన్ని పదిలంగా ఉంచటానికి వందేళ్లకుపైగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ఎక్స్​పర్ట్​ కమిటీలు వేశారు. అవి డీప్​గా స్టడీ చేసి రిపోర్టులూ ఇచ్చాయి. అయినా పక్కా ప్లానింగ్​ లేకుండా ముందుకెళుతున్నారు. దీంతో.. యునెస్కో గుర్తించిన ఈ వరల్డ్​ హెరిటేజ్​ సైట్​కి పూర్వ వైభవం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. 

ఈ అద్భుత కట్టడాన్ని మరికొన్ని శతాబ్దాలపాటు భద్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్స్​పర్ట్​ కమిటీలు స్టడీ చేయించి, రిపోర్టులు ఇస్తూనే ఉన్నాయి. లేటెస్ట్​గా ఆర్కియలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయంలో ఇసుకను తిరిగి నింపటం (శాండ్​ రీఫిల్లింగ్​) ద్వారా మందిరం పూర్తిగా కూలిపోకుండా రక్షించుకోవచ్చని రూర్కీ (ఉత్తరాఖండ్​)లోని సెంట్రల్​ బిల్డింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (సీబీఆర్​ఐ) సూచించింది. ఆ మేరకు ఏఎస్​ఐ అమలు చేయనుంది.

వందేళ్ల క్రితం కూడా..

బ్రిటిషర్ల పాలనలో తొలిసారిగా 1901–03లో శాండ్​ రీఫిల్లింగ్​ జరిగింది. నాటి లెఫ్టినెంట్​ గవర్నర్​ సర్​ జాన్​ ఉడ్​బర్న్ సలహా మేరకు ఈ పని చేశారు. ఇన్నేళ్లలో గుడి పరిస్థితి మరీ దిగజారింది. ఇంజనీరింగ్​ టెక్నాలజీ దూసుకుపోతున్న ఈ మోడ్రన్​ ఎరాలో కూడా పాత పద్ధతుల వైపే మొగ్గు చూపడమేమిటనే అభిప్రాయం ఉంది.  ప్రస్తుతానికి ఈ ఆప్షన్​ తప్ప మరొకటి లేదని, వేరే రూట్లో వెళితే మొదటికే మోసం రావచ్చుననే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే, మొట్టమొదట కట్టిన ప్రధానాలయం ఎప్పుడో కూలిపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్నది రెండోది. దీని వెడల్పు 33 అడుగులు. బ్రిటిషర్లు శాండ్​ రీఫిల్లింగ్​ చేయకపోయి ఉంటే ఈపాటికే ఒరిగిపోయి చరిత్రలో కలిసిపోయేది. గర్భగుడిలో 80 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇసుక నింపటం వల్లే ఇప్పటికీ నిలిచి ఉంది.  ఈ 117 ఏళ్లలో ఆ ఇసుక చాలావరకు కారిపోవటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.  మరోసారి శాండ్​ రీఫిల్లింగ్​ చేయటం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో అర్థం కావట్లేదని ఎక్స్​పర్ట్​లు అంటున్నారు.

ఇసుకను తొలగించాల్సిందే

ఆలయం లోపలి భాగం ఎలా ఉన్నదో తెలియడం లేదు. ఎప్పుడో వందేళ్ల నాడు నింపిన ఇసుకను తొలగిస్తేగానీ, ఎంతవరకు శిధిలం అయిందో వెల్లడి కాదు. శాండ్​ రీఫిల్లింగ్​ తర్వాత కూడా గుడి గోడలు నెర్రలిచ్చి రాళ్లు ఊడిపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. పైకప్పు కూలిపోకుండా ఉండటానికి 15 అడుగుల వెడల్పుతో నాలుగు ఇన్నర్​ వాల్స్​ని సపోర్ట్​గా కట్టారు.  ప్రస్తుతం అవి కూడా కూలిపోయే స్థితికి చేరాయి.  దీన్నిబట్టి ఈ వారసత్వ సంపదను రక్షించాల్సిన బాధ్యత కలిగిన ఏఎస్​ఐ సరైన రీసెర్చ్ చేయకుండా, కన్జర్వేషన్​ చర్యలు చేపట్టకుండా లైట్​గా​ తీసుకుంటోందని ఇట్టే తెలుస్తోంది. ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుంటే మంచినీళ్లలా ఖర్చు పెడుతోందే గానీ ఫలితాలు చూపట్లేదు.

యునెస్కో గుర్తింపు

కోణార్క్ సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో 1984లో గుర్తించింది. ‘800 ఏళ్ల ఘన చరిత్రను, అరుదైన ఆర్ట్​ స్కిల్స్​ని కళ్ల ముందు ప్రత్యక్షంగా నిలుపుతున్న నిర్మాణమిది’ అని యునెస్కో వర్ణించింది. ఇదంతా కాలంలో కలిసిపోవలసిందేనా అనే ఆవేదన హిస్టారియన్లలో నెలకొంది. సన్​ టెంపుల్​లోని గర్భగుడితోపాటు ఆ ఆవరణలోని ఇతర కట్టడాలు, రాతి కళలు, శిల్పాలు కూడా దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయ పరిరక్షణ బాధ్యతను యునెస్కోకి అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

సీబీఆర్​ఐ సిఫారసులు

    ప్రధాన ఆలయంలో ఇసుకను (శాండ్​ రీఫిల్లింగ్​) నింపాలి. గతంలో బ్రిటిషర్లు ఇదే పని చేసి, ఆలయం కూలకుండా చూశారు.

    ఈ కట్టడం చుట్టూ గ్రీన్​ బెల్ట్​ని డెవలప్​ చేయాలి.

    సరుగుడు లాంటి నిటారుగా పెరిగే మొక్కలు సముద్రం నుంచి వచ్చే గాలుల్ని అడ్డుకుంటాయి.

    ఉప్పుతో కూడిన తేమ గాలులు గుడికి తగలడంవల్ల కట్టడం దెబ్బతింటోంది.

    గతంలో జీడి మొక్కలు నాటినా ఫలితం రాలేదు. అవి మరీ ఎత్తుగా పెరగవు.

– సెంట్రల్​ బిల్డింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (సీబీఆర్​ఐ), రూర్కీ (ఉత్తరాఖండ్​)

సేఫ్టీ చర్యలు చేపడుతున్నాం

సూర్య దేవాలయం సేఫ్టీ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్​ఐ​ సూపరింటెం డింగ్​ ఇంజనీర్​ (భువనేశ్వర్ సర్కిల్​) అరుణ్​ మాలిక్​ తెలిపారు. ​పేపర్​ పల్ప్​ ట్రీట్​మెంట్​ను రోజూ చేపడుతున్నామ ని చెప్పారు. ఫణి తుఫాన్​ తర్వాత టెంపుల్​లోని ప్రతి ప్యానెల్​ని, శిల్పాన్ని లేజర్ స్కానింగ్​, ఫొటోగ్రాఫింగ్​, డాక్యుమెంటింగ్​ చేయటం వంటి ముందుజాగ్రత్తలు పాటిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్​ రిఫరె న్స్​కి, పీరియాడిక ల్​ డ్యామేజ్​ అసెస్​మెంట్​కి ఇవి అవసరమని వివరించారు. శాండ్​ రీఫిల్లింగ్​కి సీబీఆర్​ఐ నుంచి గ్రీన్​సిగ్నల్​ రాగానే ప్రాసెస్​ ప్రారంభి స్తామన్నారు. ఈ ప్లాన్లన్నీ పేపర్లకే పరిమి తమైతే ఒడిశాకి ప్రత్యేక గుర్తింపు తెస్తున్న ఈ టెంపుల్​ చాప్టర్​ ఎప్పుడైనా క్లోజ్​ కావొచ్చు. అది ఈ ఏడాదా? లేక వచ్చే సంవత్సరమా అనేది కాలమే తేలుస్తుంది.

ఇంటర్నేషనల్​ ఎక్స్పర్ట్ సాయం తీసుకోవాలి

శాండ్​ రీఫిల్లింగ్​ చేయాలన్న సీబీఆర్​ఐ రిపోర్ట్​ను ఇంటర్నేషనల్​ ఎక్స్​పర్ట్​లకు పంపించి, సలహాలు తీసుకోవాలని ‘ఇండియన్​ నేషనల్​ ట్రస్ట్​ ఫర్​ ఆర్ట్​ అండ్​ కల్చరల్​ హెరిటేజ్’​(ఇన్​టాక్​) రాష్ట్ర కన్వీనర్​ ఏబీ త్రిపాఠి సూచించారు. ఈ ఆప్షన్​కి వాళ్లు ఓకే చెబితే ముందుకు వెళ్లొచ్చన్నారు. గతంలో నింపిన ఇసుకను తొలగించటానికి ఏఎస్​ఐ ధైర్యం చేయలేకపోతోందని త్రిపాఠి తప్పు పట్టారు. చాలామంది ఇంటర్నేషనల్​ ఎక్స్​పర్ట్​లు 30, 40 ఏళ్లుగా ఇదే విషయాన్ని నెత్తీ నోరు మొత్తుకుని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.