‘టెస్కో’పై నీలినీడలు : సీనియర్ జర్నలిస్ట్ కోడం పవన్​కుమార్

వ్యక్తి క్షేమాన్ని సంఘం కోసం, సంఘ శ్రేయస్సును వ్యక్తి లాభానికి త్యాగం చేయకుండా ఉభయ ప్రయోజనాలను సమన్వయ దృష్టితో సాధింపజేసేదే సహకారోద్యమం. పరస్పర సహాయం, ఐకమత్యం, సమష్టి లాభం, స్వావలంబన తదితర ఉన్నత ఆశయాలతో సహకారోద్యమం రూపుదిద్దుకుంటుంది. చేనేత సహకారోద్యమం ఫలితంగా ఏర్పడిన చేనేత సహకార సంఘాల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 615 చేనేత సంఘాలకు పూర్తిస్థాయి ప్రతినిధి లేకపోవడంతో వాటి పనితీరు కుంటుపడింది. సంఘాల పరిధిలోని చేనేత కార్మికులకు చేయూత కరువైంది. వేల సంఖ్యలో మగ్గాలు, రాట్నాలు పనిచేసిన స్థానంలో ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. సంఘాలు నష్టాల బారినపడుతూ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, సబ్సిడీ రుణాలు అందక చేనేత కళాకారుల జీవనం ఇబ్బందిగా మారింది. ప్రతి ఐదేండ్లకోసారి జరగాల్సిన సహకార ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.  2018 ఫిబ్రవరి12న చేనేత సహకార సంఘాల పాలకవర్గం గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి గడువు పెంచుతూ వస్తోంది. పాత పాలకవర్గంనే పర్సన్ ఇన్​చార్జులుగా ఉంచుతూ కొనసాగిస్తున్నది. చేనేత సహకార సంఘాల్లో 259 కాటన్, 33 సిల్క్, 44 ఉన్ని, 157 మరమగ్గాలు, గార్మెంట్స్, టైలర్లకు సంబంధించి 122 సంఘాలున్నాయి. కరోనా కారణంతో ఎన్నికలను వాయిదా వేశామని చెప్పిన ప్రభుత్వం, వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో సంఘాలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరో నెల గడిస్తే పర్సన్ ఇన్​చార్జుల కాలం ఐదేండ్లు పూర్తికానుంది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ గురించి సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు తావిస్తున్నది. చేనేత సహకార వ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లు చేనేతవర్గాలు భావించేలా సర్కారు చర్యలుంటున్నాయి. ఇటీవల తెలంగాణ పవర్​లూమ్ ​కార్పొరేషన్ ఛైర్మన్​గా గూడూరి ప్రవీణ్, హ్యాండ్లూం కార్పొరేషన్ ఛైర్మన్ గా చింతా ప్రభాకర్​ను నియమించింది. అయినప్పటికీ సహకార సంఘాలపై దృష్టిసారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

చేనేత సహకారోద్యమం

1844లో ఇంగ్లాండులో ‘రాక్టిక్’ పట్టణంలో 28 మంది చేనేతకారులు కలిసి ప్రపంచంలోనే తొలి ‘వీవర్స్ వినియోగదారుల సంఘం’ను స్థాపించారు. ఇలా ప్రపంచంలో సహకార చట్టం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ‘కో ఆపరేటివ్ సొసైటీ’ చేనేతదే కావడం విశేషం. మన దేశంలో 1904లో సహకార చట్టం ఏర్పడింది. 20వ శతాబ్దం ఆరంభం నుంచి మరీ పతనమైపోతున్న చేనేత కులవృత్తిని ఆదుకోవాలని అన్ని వర్గాల నుంచి విజ్ఞాపనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుండటంతో, 1933లో విదేశీ నూలు దిగుమతిపై సుంకం వేసి, ఆ వచ్చిన రాబడితో చేనేతాభివృద్ధికి ఖర్చు చేయాలని అప్పటి కేంద్ర పాలకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏటా రూ.5 లక్షలు చేనేత పరిశ్రమకు కేటాయిస్తూ వచ్చింది. రాష్ట్రాల వారీగా, మగ్గాల సంఖ్యను బట్టి ఈ డబ్బులు పంచారు. అత్యధిక డబ్బును చేజిక్కించకున్న అవిభక్త మద్రాసు రాష్ట్రంలో తొలి ‘చెన్నై రాష్ట్ర చేనేత సహకార సంఘం’ ఏర్పడింది. దేశంలోనే మొదటి అపెక్సు సొసైటీ ఇది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఈ సంఘాలు ఏర్పడ్డాయి. చేనేత సహకారోద్యమంలో పెండెం వెంకట్రాములు, కార్యంపూడి రాజమన్నారు, వెంకటకృష్ణయ్య, రత్న సభాపతి మొదలియార్, మాచని సోమప్ప, కొండా లక్ష్మణ్ బాపూజీ, అక్కల కోటయ్య, ప్రగడ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితంగా ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం ‘ఆప్కో’.

ఉమ్మడి ఆస్తుల విభజన జరగక..

సహకార సంఘాలకు పని కల్పించడం, వస్త్రాలను కొనుగోలు చేయడానికి ఏర్పడిందే ఆప్కో. రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో టెస్కో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం) ఏర్పడింది. చేనేత, మరమగ్గాలకు విడివిడిగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త వ్యవస్థకు రూపకల్పన చేసింది. దీంతో ‘టెస్కో’ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని మూసివేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలు ‘ఉంటాయా, ఊడుతాయా’ అనే మీమాంస చేనేత వర్గాల్లో నెలకొంది. రాజకీయంగా బలంగా లేని పద్మశాలి వర్గంలో ఓ విధమైన అంతర్మథనం మొదలైంది. రెండు కార్పొరేషన్ల విధి విధానాల్లో ఇంతవరకు స్పష్టత లేకపోవడం ఒక ఎత్తయితే, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య చేనేత కళాకారులు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. టెస్కోకు మేథోసంపత్తి కలిగిన ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. స్థిర, చరాస్తులు ఉన్నాయి. పేర్లకు టెస్కో, ఆప్కో మనుగడలో ఉన్నా, ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. ఇన్ని చిక్కుముడుల మధ్య అధికారులు, చేనేత వర్గాలకు అంతుపట్టని వాతావరణం కొనసాగుతున్నది. దీంతో పలు సంఘాలు నష్టాల్లో కూరుకుపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, సబ్సిడీ రుణాలు అందకపోవడంతో పలువురు చేనేతకారుల జీవనం దయనీయంగా మారింది. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో చైర్మన్లు సంఘాలపై దృష్టి సారించడం లేదు.

చేనేత బంధు కావాలి..

చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్లు ఏర్పడటంతో ‘టెస్కో’తో పనిలేదనే చర్చ జరుగుతున్నది. డైరెక్టర్లను నియమించకపోవడం ఈ చర్చకు బలం చేకూరుస్తున్నది. టెస్కో చేసే పని ఇక కార్పొరేషన్లు చక్కబెడతాయని భావిస్తున్నారు. దీంతో సహకార సంఘాలకు తెరపడుతుందని చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకైతే కార్పొరేషన్ల పాత్రపై అధికారులు, నాయకుల్లో స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా వెలువడలేదు. సహకార, సహకారేతర రంగాల అభ్యన్నతి కోసం కార్పొరేషన్లు పనిచేస్తాయని మాత్రం సంబంధిత అధికారులు, ఎంపికైన చైర్మన్లు చెబుతున్నారు. టెస్కోను ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు. దశాబ్దాలుగా చేనేత కళాకారులకు భరోసానిచ్చిన సొసైటీల గమ్యం ఎటువైపు అనేది తేలడం లేదు. పాలకమండళ్ల ఆచూకీ అందడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఆప్కో పాలకమండళ్లను పక్కన పెట్టారు. నాలుగేండ్లుగా అధికారుల పెత్తనంతో చేనేతరంగం చుక్కాని లేని పడవలా సాగుతోంది. పదవుల కోసమే కార్పొరేషన్లు ఏర్పడ్డాయని విమర్శలు వస్తున్నాయి. సొసైటీలను కార్పొరేషన్లలో విలీనం చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల వృత్తి సమస్యల చిక్కుముడుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చేనేత కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, చిక్కుముడులు విప్పి ప్రశాంతంగా కులవృత్తిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్స్, వ్యక్తి గత రుణాల మాఫీ, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలి. దళితబంధు తరహాలో చేనేతబంధుతో పాటు ఇతరత్రా పథకాలను కొనసాగించాలి. బతుకమ్మ చీరలను ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయాలి. చేనేత వస్త్రాలపై అబ్బురపరిచే డిజైన్లతో దేశ, విదేశాల్లో గుర్తింపు వచ్చేలా తోడుగా నిలవాలి.

- కోడం పవన్​కుమార్, సీనియర్ జర్నలిస్ట్