రాళ్ల గుట్టలకు 25 వేల కోట్ల రైతుబంధు

రాళ్ల గుట్టలకు 25 వేల కోట్ల రైతుబంధు
  • రియల్​ ఎస్టేట్​వ్యాపారులకూ గత సర్కారు దోచిపెట్టింది: శ్రీధర్​బాబు
  • ఓట్ల కోసం రైతులను పదేండ్లు మోసం చేసిన్రు
  • రైతుభరోసాపై ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు రాళ్ల గుట్టలకు రూ.25 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిందని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. రియల్​ఎస్టేట్​వ్యాపారులకు, ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు, సాగులో లేని రాళ్ల గుట్టలకు రైతుబంధు పేరిట దోచి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018–19 నుంచి 2022–2023 వరకు రూ.25,672 కోట్ల రైతుబంధు నిధులను సాగులోలేని భూములకు చెల్లించిందని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

 ఓటు బ్యాంకు రాజకీయాలతో పదేండ్ల పాటు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్​ నేతలు.. ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని శ్రీధర్​బాబు మండిపడ్డారు. రైతుబంధు పథకంలో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది కొత్తగా రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అందుకు ప్రతిపక్షంగా అభినందించాల్సిందిపోయి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.‘‘మీ పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. వ్యవసాయం గిట్టుబాటుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఉసురు తగిలే మీరు అధికారం కోల్పోయారు.

 2014–2022 వరకు తెలంగాణలో 6,121 మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని మరచిపోయారా? నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలవన్మరణాల అంకెలను 2022లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలవండి. 

తద్వారా మీ పాపాలను కడుక్కోండి. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మీరు గద్దె దిగినా.. రైతులకు ఇచ్చిన మాట మేరకు మా ప్రభుత్వం ఏకకాలంలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేసింది. మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి ప్రయత్నించండి’’ అని మంత్రి సూచించారు.