ఏటా రూ.100 కోట్లు.. మూడు నెలల్లో కళాభవన్​ నిర్మాణం

  •     ఐటీ హబ్​తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతయ్​
  •     మున్సిపల్, ఐటీ​మినిస్టర్​ కేటీఆర్​

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​సిటీ డెవలప్​మెంట్​కు కట్టబడి ఉన్నామని ఐటీ, మున్సిపల్​ మినిస్టర్​ కేటీఆర్​ పేర్కొన్నారు. మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని డెవలెప్​మెంట్​పనుల కోసం ఒక్కో డివిజన్​కు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు  మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం పాల్​టెక్నిక్​ గ్రౌడ్​లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రతీ ఏడాది నిజామాబాద్​సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అండర్​ గ్రౌండ్ ​డ్రైనేజీ కోసం రూ.232 కోట్లు, నీటి సరఫరాకు రూ.98 కోట్లు, మిషన్​ భగీరథ కింద రూ.20 కోట్లు, రైల్వే అండర్​పాస్​కు రూ.20 కోట్లు, టీయూఎఫ్​ఐడీసీ కింద రూ.100 కోట్లు ఇచ్చామన్నారు. ప్రజాకవి దాశరథి జైలు జీవితం గడిపిన ఇందూరులో కవులు, కళాకారులు, సాహితీ ప్రియులకు కొదువలేదని వారి కోసం రూ.50 కోట్లతో కళాభవన్​ నిర్మిస్తున్నామని, దీన్ని మూడు నెలల్లోగా కంప్లీట్​ చేస్తామని చెప్పారు.

ఐటీ హబ్​తో ఉద్యోగాలు..

జిల్లా కేంద్రాలకు సైతం సాఫ్ట్​వేర్​ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చామని, నిజామాబాద్​లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే ఇక్కడ 1400 మంది నిరుద్యోగులు సెలెక్ట్​ అయినట్లు చెప్పారు. న్యాక్​(నేషనల్​అకాడమీ ఆఫ్​ కన్​స్ట్రక్షన్)లో ప్లంబర్, ఎలక్ర్టీషియన్, సెంట్రింగ్​ తదితర బిల్డింగ్​నిర్మాణ పనుల్లో శిక్షణ తీసుకోవచ్చన్నారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా చదివిన వారికి న్యాక్​ ట్రైనింగ్​ మేలు చేస్తుందన్నారు. నిజామాబాద్ ​మున్సిపల్​ఆఫీస్​ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరంలో హైటెక్​ హంగులతో నిర్మించిన మూడు శ్మశాన వాటికలు హైదరాబాద్​లోని మహాప్రస్థానం కంటే గొప్పగా ఉన్నాయని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. 

తన సోదరి ఎమ్మెల్సీ కవితకు జిల్లా అంటే అమితమైన ప్రేమ ఉందని, జిల్లాకు కేటాయించాల్సిన ఫండ్స్​ గురించి సీఎం కేసీఆర్​తో మాట్లాడడానికి వెళ్లినందువల్ల ఆమె సభకు రాలేదన్నారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్​రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ​బాజిరెడ్డి గోవర్ధన్, మార్క్​ఫెడ్ ​చైర్మన్ ​మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్​ విఠల్​రావు, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షురాలు ఆకుల లలిత, ఎమ్మెల్యేలు జీవన్​రెడ్డి, షకీల్, గణేశ్​గుప్తా, మేయర్ ​నీతూకిరణ్, డీసీసీబీ చైర్మన్ ​పోచారం భాస్కర్​రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్​ఎల్​ఎంబీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్, వీజీగౌడ్, మాజీ మేయర్​ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.