మహబూబ్ నగర్ జిల్లాలో అమర రాజాతో మరింత అభివృద్ధి : మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌

మహబూబ్ నగర్ జిల్లాలో అమర రాజాతో మరింత అభివృద్ధి : మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌
  • కంపెనీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు
  • మహబూబ్ నగర్ జిల్లాలో అమర రాజా గిగా ఫ్యాక్టరీ యూనిట్1కు శంకుస్థాపన
  • స్థానిక రైల్వే స్టేషన్​  ఆధునికీకరణకు మంత్రి హామీ 
  • 6,400 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు
  • 400 మంది మహిళలు సహా 4,500 మందికి ఉపాధి

మహబూబ్‌‌నగర్‌‌ రూరల్, వెలుగు: తెలంగాణలో అమర రాజా ఫ్యాక్టరీ ఏర్పాటుతో మరింత అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌‌, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ అన్నారు. మహబూబ్‌‌నగర్‌‌ రూరల్‌‌ మండలం దివిటిపల్లిలో రూ. 6,400 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమర రాజా గిగా ఫ్యాక్టరీ, ఆల్టిమిన్‌‌, లోహం మెటీరియల్స్, ఎస్సెల్‌‌ ఎనర్జీ ప్రైవేట్‌‌ లిమిటెడ్ ప్లాంట్లకు రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్‌‌బాబుతో కలిసి కేంద్ర మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. స్టీల్, కెమికల్స్‌‌ మాదిరిగా బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై కొత్త పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

దివిటిపల్లిలో అమర రాజా గిగా ఫ్యాక్టరీ యూనిట్1కు శంకుస్థాపన చేయడం ఒక ముందడుగు అని చెప్పారు. కంపెనీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వనున్నారని, అలాగే 400 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు నేపథ్యంలో దివిటిపల్లి రైల్వేస్టేషన్‌‌ను ఆధునీరిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్ల కిందట ఉమ్మడి ఏపీలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రకు రైల్వే బడ్జెట్‌‌లో రూ.886 కోట్లు కేటాయించిందని.. ప్రస్తుతం ప్రధాని మోదీ హయాంలో ఒక్క తెలంగాణకే రూ.5,337 కోట్ల బడ్జెట్‌‌ కేటాయించామని తెలిపారు. 

కాగా, ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్‌‌నగర్‌‌ ఎంపీ డీకే అరుణ, కలెక్టర్‌‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌‌ నిర్మలా జగ్గారెడ్డికి కేంద్రమంత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, టీజీఐఐసీ వీసీ & ఎండీ ఈ. విష్ణువర్ధన్‌‌ రెడ్డి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్‌‌ లక్ష్మణ్‌‌ యాదవ్‌‌, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్‌‌ రెడ్డి పాల్గొన్నారు.

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: శ్రీధర్‌‌బాబు 

రాష్ట్రంలో పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం దృష్టి సారించిందని ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. సీఎం రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. తెలంగాణకు కేంద్రం కూడా అండగా నిలవాలని, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాలని కోరారు. సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి రాష్ట్రం అనుకూలంగా ఉందన్నారు. 

కేంద్ర మంత్రి చొరవ తీసుకుని సెమీ కండక్టర్ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్, క్లీన్‌‌ అండ్‌‌ గ్రీన్‌‌ పాలసీలను తీసుకొచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్‌‌ లిమిటెడ్ ఆధ్వర్యంలో పదేండ్లలో రూ. 9,852 కోట్ల పెట్టుబడులు పెడతామని కంపెనీ ఎండీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 4,500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.