గామి మూవీ మార్చి 8న విడుదల

విశ్వక్‌‌‌‌ సేన్ హీరోగా  విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘గామి’.  ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, విశ్వక్ సేన్ గెటప్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ చిత్రాన్ని  మార్చి 8న వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా  విడుదల చేయనున్నట్టు బుధవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘వారణాసిలో ‘గామి’ షూటింగ్ చేస్తున్నపుడు ఫోన్‌‌‌‌లో ‘ఫలక్‌‌‌‌నుమా దాస్’ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడిని. దర్శకుడు విద్యాధర్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు కష్టపడ్డాం. కుంభమేళాలో ఒకరిద్దరు నేను నిజమైన అఘోర అనుకొని ధర్మం చేశారు.

ఓ ముసలామె భోజనం పెట్టి, టీ ఇచ్చింది. అయితే అవుట్‌‌‌‌పుట్ చూశాక కష్టాలన్నీ మర్చిపోయాం’’ అని చెప్పాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్‌‌‌‌గా నటించగా, ఎం.జి. అభినయ, హారిక, మహ్మద్ సమద్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నాడు.