ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌కు చెందిన పలువురు జిన్నింగ్ మిల్లుల వ్యాపారుల ఇండ్లలో ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. తెల్లవారుజామున మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. జిల్లా కేంద్రానికి చెందిన బడా వ్యాపారి, బీఆర్ఎస్ నేత రఫిక్ ఇంట్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కాగజ్ నగర్ పట్టణం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కాసం శ్రీనివాస్ ఇంట్లో, వ్యాపారులు చిలువేరు సత్యనారాయణ, చిలువేరు గంగన్న ఇంట్లో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే పట్టణానికి చేరుకున్న ఐటీ అధికారుల బృందాలు వేర్వేరుగా రైడ్ చేశారు. కాసం శ్రీనివాస్ ఇంట్లో నుంచి ఆయనను ఎస్బీఐ బ్యాంకుకు తీసుకెళ్లి అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని, ఓ బ్యాగ్‌ను సీజ్ చేసి ఇంట్లో సోదాలు కొనసాగించారు. జిల్లాలో ఏకకాలంలో పలువురి ఇండ్లలో సోదాలు జరుగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాండూరులోని జిన్నింగ్ మిల్లుల్లో సోదాలు
బెల్లంపల్లి రూరల్: తాండూరు మండలం రేపల్లెవాడ గ్రామంలోని మహేశ్వరి కాట్స్, శ్రీరామ జిన్నింగ్ మిల్లుల్లో మంగళవారం ఐటీ ఆఫీసర్లు దాడులు చేపట్టారు. తెల్లవారుజామున 6 గంటలకు రెండు జిన్నింగ్ మిల్లుల కార్యాలయాలకు చేరుకున్న ఐటీ బృందం రికార్డులను స్వాధీనం చేసుకొని సోదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సన్నిహితులైన పలువురి నేతలకు ఈ జిన్నింగ్ మిల్లులతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.