పెద్దపల్లిలో అభ్యర్థులు రెడీ..ప్రచారమే తరువాయి

  •     మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి అభ్యర్థులు 
  •     కాంగ్రెస్​ నుంచి యువనేత గడ్డం వంశీకృష్ణ 
  •     తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ బాటలో ఎంపీగా పోటీ 
  •     బీజేపీ నుంచి గోమాస, బీఆర్ఎస్​ నుంచి కొప్పుల 
  •     గెలుపే లక్ష్యంగా అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు 

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్లు ఎవరన్నది తేలిపోయింది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్​ హైకమాండ్​ గురువారం రిలీజ్​చేసిన సెకండ్​ లిస్టులో గడ్డం వంశీకృష్ణకు టికెట్​దక్కింది. ఇప్పటికే బీజేపీ గోమాస శ్రీనివాస్​ను, బీఆర్​ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​ను బరిలోకి దించాయి. ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో మే 13న పోలింగ్​ జరుగనుండగా సుమారు 50 రోజుల గడువు ఉండడంతో ప్రచారం హోరెత్తనుంది. 

నాడు తండ్రితో, నేడు తనయుడితో గోమాస

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే భారం వేసింది. ‘ఔర్​ఏక్​ బార్.. మోదీ సర్కార్’ నినాదంతో ఆ పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా స్ట్రాంగ్​క్యాండిడేట్​ను బరిలోకి దించాలని ప్రయత్నించింది. చివరకు కాంగ్రెస్ ​నాయకుడు గోమాస శ్రీనివాస్​కు కాషాయ కండువా కప్పి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 2009లో బీఆర్​ఎస్​ నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేశారు. 

తెలంగాణ ఉద్యమం పీక్​ స్టేజ్​లో ఉన్నప్పుడే అప్పటి కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్ ​చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వంశీకృష్ణతో తలపడుతున్నారు. ఈ సెగ్మెంట్​లో బీజేపీకి పెద్దగా క్యాడర్​ లేదు. గోమాసకు తన సామాజికవర్గమైన నేతకాని సంఘాల లీడర్​గా గుర్తింపు ఉన్నప్పటికీ వారు ఎంతవరకు కలిసివస్తారో తెలియదు. నియోజకవర్గంలోని ఎస్సీల్లో నేతకానీ ఓటర్ల సంఖ్య కూడా తక్కవే. మెజారిటీ దళితులు, మైనారిటీలు కాంగ్రెస్​వైపే ఉండడంతో బీజేపీ అభ్యర్థి చెమటోడ్చక తప్పదు.  

అయిష్టంగానే బరిలోకి కొప్పుల

అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ ​గ్రాఫ్​ ఆ తర్వాత రోజురోజుకూ డౌన్​ అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి రావడం వల్ల మరింత అభాసుపాలైంది. ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ కారు వదిలి కాంగ్రెస్​బాటపట్టడం హైకమాండ్​ను కలవరపెడుతోంది. చివరకు ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అధినేత కేసీఆర్ ​మాట కాదనలేక అయిష్టంగానే బరిలోకి దిగినట్టు సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. 

జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, బెల్లంపల్లి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. దాదాపు పది మంది జడ్పీటీసీ మెంబర్లు హస్తం పార్టీ నేతలతో టచ్​లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన మీటింగులకు ఆశించిన స్పందన రాకపోవడం అభ్యర్థిని ఆందోళనకు గురిచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ ఇటీవలే బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలను ఎదుర్కోవడం బీఆర్​ఎస్​కు కత్తిమీద సాములా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తాత, తండ్రి బాటలో వంశీకృష్ణ

తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్​ వెంకటస్వామి బాటలో పెద్దపల్లి నుంచే వంశీకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకటస్వామి ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన వారసుడిగా కొడుకు వివేక్​ వెంకటస్వామి 2009లో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం చెన్నూర్​ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దనాన్న వినోద్​2004లోనే చెన్నూర్ ​నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 

మొన్నటి ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి విజయం సాధించారు. ఇలా కాకా ఫ్యామిలీకి పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​తో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. కాంగ్రెస్​పార్టీకి నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్టమైన క్యాడర్​తో పాటు కాకా అనుచరులు, అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్​ మొదటి నుంచి ఊహించినట్టే వంశీకృష్ణకు దక్కడంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్​ హైకమాండ్​ టికెట్​ ప్రకటించిన వెంటనే జిల్లావ్యాప్తంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సైతం కాంగ్రెస్​కు పూర్తి అనుకూలంగా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించడం తెలిసిందే. ఆరు గ్యారంటీల అమలుతో ఆ పార్టీ వంద రోజుల పాలనకు ప్రజల ఆమోదం లభించింది. దీంతో కాంగ్రెస్​ శ్రేణులు ‘గెలుపు ఖాయం.. మెజారిటీయే లక్ష్యం’ అంటూ ముందుకెళ్తున్నాయి.