వరంగల్, వెలుగు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2020 జనవరి 7న మడికొండ రాంపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెక్ మహేంద్రా న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం వచ్చారు. దీంతోపాటే అంతకుముందు నుంచి నడుస్తున్న సైయెంట్ ఐటీ కంపెనీకి చెందిన కొత్త బిల్డింగ్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివిధ కంపెనీల చైర్మన్లు, ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. వరంగల్ సిటీని ఐటీ రంగంలో ముంబై, పుణెలా తీర్చిదిద్దే బాధ్యత తనదే అన్నారు. సభలో ఉన్న ఉన్న టెక్‍మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, సైయెంట్ఎగ్జిక్యూటివ్చైర్మన్ బీవీఆర్ మోహన్‍రెడ్డి సహకారం అడిగారు. కావాల్సిన మౌలిక వసతులు, అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు కంపెనీల ప్రతినిధులు వారి సంస్థలను డెవలప్ చేస్తూనే మరిన్ని కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. కావాలంటే మరో 80 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధమన్నారు. 15 రోజుల్లో కావాల్సిన పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 16 ప్రధాన ఇంజినీరింగ్ కాలేజీల్లో నైపుణ్యం కలిగిన యువత జాబ్స్ చేయడానికి రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు. తీరాచూస్తే దాదాపు మూడేళ్ల టైం దగ్గరకొచ్చినా.. కొత్తగా ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు.
జాడలేని ఇండస్ట్రీయల్ కారిడార్
వరంగల్ సిటీని ఐటీ హబ్‍గా మార్చడానికి తోడు హైదరాబాద్ – వరంగల్ మార్గాన్ని ఇండస్ట్రీయల్ కారిడార్‍గా మార్చనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు దారి పొడవునా పరిశ్రమలు వచ్చేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో గీసుగొండలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు తోడుగా, స్టేషన్ ఘన్‍పూర్‍లో లెదర్ పార్క్, జనగామ, భువనగిరిలో కొత్త తరహా పరిశ్రమలు తీసుకొస్తామని మాటిచ్చారు. ఇవేగాక మహబూబాబాద్‍లో ఆహారశుద్ధి క్లస్టర్, నర్సంపేటలో ఆగ్రో బేస్డ్ఇండస్ట్రీ, కొడకండ్లలో మరో టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందులో ఏ ఒక్కటి రాలేదు. 2020 జనవరిలో కేటీఆర్ వరంగల్ వచ్చిన సమయంలో మూడో కంపెనీగా క్వాండ్రంట్ రిసోర్సెస్ సంస్థ వరంగల్‍లో తమ బ్రాంచ్ ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు. దీనికోసం 1.5 ఎకరాల స్థలం ఇస్తున్నామని.. 500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ కంపెనీ ప్రతినిధులు భూమిపూజ చేసినప్పటికీ.. పనులు పూర్తి కాలేదు. అదే ఏడాది ఫిబ్రవరి 7న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎల్ అండ్ టీ సీఈఓ సుబ్రమణ్యన్‍తో భేటీ అయ్యారు. అనంతరం ‘త్వరలోనే వరంగల్‍లో ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ మైండ్ ట్రీ కంపెనీ’ అంటూ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. ఈ సంస్థ సైతం అటే పోయింది.
ఎయిర్‍పోర్ట్.. హెలిపోర్ట్ ఉత్తిమాటే
వరంగల్ సిటీలో ఐటీ అండ్ ఇండస్ట్రీయల్ కంపెనీలు పెట్టడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్ అక్కడున్న కంపెనీల ప్రతినిధులకు మాటిచ్చారు. సిటీ జనం ప్రయాణానికి అనువుగా ఉండేలా మోనో లేదంటే మెట్రో ట్రెయిన్లలో ఏదో ఒకటి అందుబాటులోకి తీసుకువస్తామని కేటీఆర్ చెప్పారు. అదే సమయంలో టెక్ మహేంద్రా సీఈఓ గుర్నాని మాట్లాడుతూ.. వరంగల్‍లో ఐటీ కేంద్రం విస్తరణకు వచ్చే కంపెనీ ప్రతినిధులకు దగ్గర్లో హెలికాప్టర్ లాండింగ్ సేవలు ఉండే బాగుంటుందని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి.. ఇప్పటికే వరంగల్‍లో మామూనూర్ ఎయిర్‍పోర్టు ఉందని, త్వరలోనే జీఎంఆర్ సంస్థతో మాట్లాడి దానిని రీఓపెన్ చేస్తామన్నారు. సిటీలో హెలిపోర్టు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
వేల మందికి ఉపాధి ఎక్కడ?
వరంగల్ సిటీని ఐటీ హబ్‍గా మార్చి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. టెక్ మహీంద్రా, సైయెంట్ వరంగల్ లో కంపెనీలు ప్రారంభించే సమయంలో 100 మందికి చొప్పున ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని.. రాబోయే రెండు మూడేండ్లలో వాటిని 8 నుంచి 9 వేల ఉద్యోగాలకు పెంచే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. తీరాచూస్తే.. గతంలో చెప్పిన 200 మంది కూడా ఇప్పుడు లేరనే విమర్శ ఉంది. మొత్తంగా జిల్లా పర్యటనకు వచ్చే సమయంలో ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న హామీలను ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు. హామీల అమలులో శ్రద్ధ చూపాల్సిన స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోడం లేదు.