గంటల కొద్దీ నిలిచిపోయే వాహనాలు
ఫ్లై ఓవర్లు, అండర్పాస్లున్నా రద్దీ తగ్గుతలే
ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు నిల్
మాదాపూర్, వెలుగు : వానొస్తే.. ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్‌గా ఐటీ కారిడార్ మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ ఐటీ హబ్‌గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదేస్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు.. మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారుతాయి. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాదాపూర్బాటా షోరూం, నెక్టార్‌గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐఐటీ ఎదురుగా, గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరదనీరు నిలిచిపోతుంది. క్లియర్ అవ్వడానికి 2 గంటలు పడుతుంది. మూడు, నాలుగు లేన్ల రోడ్డులో కార్లు, బస్సులు, బైకులు ఒకటి, రెండు లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. జేఎన్‌టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూట్ రెండు వైపులా, షేక్‌పేట్ నుంచి ఖాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్అంతా ట్రాఫిక్ నిలిచిపోతుంది. వాన పడితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి మునిగిపోతుంది. దీంతో ఐటీ కారిడార్‌కు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు నల్లగండ్ల ఫ్లై ఓవర్ మీదుగా హైటెక్‌సిటీకి వెళ్తుండగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి గచ్చి బౌలి రూట్‌లో ప్రధాన రోడ్లలో వెళ్లే వాహనాలతో ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో, అల్టర్నేట్ రూట్‌లో కూడా అంతే ఉంటుంది.
కార్లలో వస్తుండగా..
సిటీలో వానపడితే బైక్‌లపై ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు సొంత కార్లలో వెళ్తుంటారు. అలా వెళ్లడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమని పోలీసులు ఉన్నతాధికారులు, ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఐటీ కారిడార్‌లో మొత్తం 11 ఫ్లైఓవర్లు, రెండు అండర్ పాస్‌లు, రెండు ఆర్ యూజీలు ఉన్నాయి. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రూట్‌లో మరో ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. ఫ్లై ఓవర్ అండర్‌పాస్‌లు, లింకురోడ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ రద్దీ పెరుగుతూనే ఉంది. మాదాపూర్‌లోని మా ఇంటి నుంచి కోకాపేట్‌లోని ఆఫీస్‌కు 12 కిలోమీటర్లు ఉండగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆఫీస్‌కు వెళ్లి వచ్చేందుకు రెండున్నర గంటల పాటు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వస్తుందని ఐటీ ఉద్యోగి అసిఫ్ తెలిపాడు.