టాలీవుడ్‌‌‌‌లో ముగిసిన ఐటీ సోదాలు

 టాలీవుడ్‌‌‌‌లో ముగిసిన ఐటీ సోదాలు
  • దిల్‌‌‌‌ రాజు, డైరెక్టర్ సుకుమార్‌‌‌‌‌‌‌‌, సినీ ఫైనాన్షియర్ల ఇండ్లలో తనిఖీలు 
  • కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
  • దిల్‌‌‌‌ రాజు తల్లికి అస్వస్థత.. హాస్పిటల్‌‌‌‌కు తరలింపు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: టాలీవుడ్‌‌‌‌ నిర్మాతలు, డైరెక్టర్లు, ఫైనాన్షియర్ల ఇండ్లలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు గురువారం మధ్యాహ్నం ముగిశాయి. భారీ బడ్జెట్‌‌‌‌ సినిమాలే టార్గెట్‌‌‌‌గా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో వివిధ రకాల ట్యాక్సుల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం తదితర అనేక అంశాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా గేమ్‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్‌‌‌‌ సహా ఈ నెలలో విడుదలైన సినిమాలకు సంబంధించి ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వివరాలు సేకరించింది. 

తెలంగాణ ఫిలిం డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌డీసీ) చైర్మన్‌‌‌‌, నిర్మాత దిల్‌‌‌‌ రాజు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. గురువారం సోదాల సమయంలో దిల్‌‌‌‌ రాజు తల్లి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఐటీ సిబ్బంది హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పుష్ప-2 చిత్ర నిర్మాతలు నవీన్‌‌‌‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌‌‌‌, మైత్రీ మూవీస్‌‌‌‌ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్‌‌‌‌ సంస్థ కార్యాలయాల్లో, సింగర్ సునీత భర్త రామ్‌‌‌‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్‌‌‌‌ సినిమాలకు ఫైనాన్స్‌‌‌‌ చేసే సత్య రంగయ్య, అభిషేక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ ఇల్లు, కార్యాలయాల్లోనూ మూడు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 దిల్‌‌‌‌ రాజు ప్రొడక్షన్స్‌‌‌‌, మైత్రీ మూవీ మేకర్స్‌‌‌‌, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా.. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేపట్టారు. ఇందులో సినిమాలకు సంబంధించిన బడ్జెట్‌‌‌‌తో పాటు ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించినట్టు తెలిసింది. దీంతో పలు డాక్యుమెంట్లు, హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లు, ఆడిట్ రిపోర్టులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.