3వరోజు కొనసాగుతున్న ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ : భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీశాఖ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. కొత్తపేట గ్రీన్ హీల్స్ కాలనీలోని ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాలకు వ్యతిరేకంగా భువనగిరికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని చూపించాలని ఆయన అభిమానులు, కార్యకర్తల నిరసన చేపట్టారు. కార్యకర్తల ఆందోళనలతో బాల్కనీలోకి వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు ఎమ్మెల్యే ఫైళ్ల  శేఖర్ రెడ్డి. 

తమ ఇంటి వద్ద ఎవరూ ఆందోళనలు చేయవద్దని ఎమ్మెల్యే ఫైళ్ల  శేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా ఐటీశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని, ఎప్పటి వరకు పూర్తవుతాయో చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. అయితే.. సోదాలపై తనకు కూడా సమాచారం లేదని ఎమ్మెల్యే చెప్పారు. ఐటీ అధికారుల సోదాలకు వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి.