దివిస్ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారుల సోదాలు

చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లాలోని దివిస్ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిగాయి. చౌటుప్పల్​మండలం అంకిరెడ్డిగూడెంలో ఉన్న దివిస్​ఫార్మా కంపెనీకి ఉదయం 11 గంటలకు వచ్చిన అధికారులు.. లోనికి వెళ్లి కంపెనీ గేట్లను మూసి వేయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కంపెనీలోని పెద్ద ఉద్యోగుల సెల్​ఫోన్లు మూగబోయాయి. కంపెనీలోకి స్థానిక పోలీసులతో సహా ఇతరులెవరిని అనుమతించడం లేదు. ఐటీ దాడుల విషయం స్థానిక పోలీసులను అడిగినా.. తమకేం తెలియదని చెబుతున్నారు. దీంతో అసలు కంపెనీలో ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. 

5 రోజుల క్రితమే ఇద్దరు మంత్రులు
అక్టోబర్ 27న మంత్రులు శ్రీనివాస్​ గౌడ్​, మల్లారెడ్డి దివిస్​ కంపెనీకి వెళ్లారు. యాజమాన్యంతో కాలుష్యం, స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై చర్చించినట్టు చెప్పారు. నవంబర్​నుంచి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయితే మంత్రులు వచ్చివెళ్లిన ఐదో రోజే కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఎన్నికలకు సంబంధించి డబ్బు వ్యవహారం కారణంగా ఐటీ దాడులు జరిగాయా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.