- ఏసీబీ నుంచి వివరాలు తీసుకోనున్న దర్యాప్తు సంస్థలు
- రూ.250 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతంపై త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించనున్నట్టు తెలిసింది. అధికార దుర్వినియోగం, అడ్డగోలు అనుమతుల జారీతో దాదాపు రూ.250 కోట్ల మేర ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా, ఐటీ అధికారులు కూడా ఏసీబీ నుంచి కేసు వివరాలు తీసుకోనున్నట్టు సమాచారం.
శివబాలకృష్ణపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తులో గుర్తించిన అక్రమాస్తుల వివరాలను ఐటీ, ఈడీ అధికారులు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరో రెండు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే మరిన్ని అవినీతి బయటపడే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. కాగా, శివబాలకృష్ణ తన అక్రమార్జనలో ఎక్కువ భాగం కుటుంబ సభ్యులు, ఇతర బినామీల పేరిట ఉంచినట్టు ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైనా పలు డాక్యుమెంట్లు ఏసీబీ అధికారుల చేతికి వచ్చాయి. శివబాలకృష్ణకు ప్రధాన బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివనవీన్ కుమార్ను ఏసీబీ మంగళవారం రాత్రే అరెస్టు చేసింది. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. మరోవైపు శివనవీన్ కుమార్ కస్టడీ కోసం ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.