
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు సోదాలు చేస్తున్నారు. ఇంట్లోనే కవితో పాటుగా ఆమె భర్త అనిల్ ఉన్నారు. కవిత ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.
సుప్రీంకోర్టులో కేసు ఉన్నా.. సోదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కవిత న్యాయవాది సోమా భరత్. కవితను కలవడానికి వెళ్తే లోపలికి అనుమతించట్లేదని చెప్పారు. సోదాలు ముగిసిన తర్వాత కవితను కలవండని ఈడీ అధికారులు తనకు సూచించినట్లుగా వెల్లడించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా? తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది. ఈ టైంలో ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు. కవిత ఇంట బయటే సోమ భరత్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సోదాలు జరుగుతున్నంత సేపు ఇంట్లోకి ఎవరిని అనుమతించవద్దని సీఆర్పీఎఫ్ జవాన్లకు ఈడీ అధికారులు చెప్పారు.
కవిత ఇంట్లో సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.