
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడి రూ. లక్షల్లో కోల్పోయి.. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. వైఎస్సార్ నగర్ కు చెందిన షేక్ అజీజ్(29) హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడుతూ.. రూ. 25 లక్షలు కోల్పోయాడు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగా మందలించారు.
ఇల్లు అమ్మి తీరుస్తామని, సమయం కావాలని కొడుకుకు సూచించారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపం చెందిన అజీజ్ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకుని ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందడంతో ఖానాపురం హావేలి పోలీసులు వెళ్లి డెడ్ బాడీని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. మృతుడి తండ్రి గోరేమియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సీఐ భాను ప్రకాశ్ తెలిపారు.