ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ ఉద్యోగి మృతి

  • హైదరాబాద్​లోని ఏఎస్ రావు నగర్​లో ప్రమాదం

కుషాయిగూడ, వెలుగు: ‘‘పిల్లలతో కలిసి బయటికెళ్దాం! పది నిమిషాల్లో ఇంటికొస్తున్నా’’ అని తన భార్యకు చెప్పాడు భర్త. మరి కొద్దిసేపట్లో బయటికెళ్లి ఆనందంగా గడుపుతామని భావించిన ఆ కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. భర్త వెళ్తున్న బైక్​ను బస్సు ఢీకొట్టడంతో ఆయన చనిపోయాడు. కుషాయిగూడ పీఎస్​ పరిధిలోని ఏఎస్​రావు నగర్​ మెయిన్​ రోడ్డులో శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడిని కొడిమెళ్ల కిరణ్​కుమార్​(30)గా గుర్తించారు.  సైనిక్​పురిలో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్​కు భార్య అశ్విని, పిల్లలు విఘ్నేష్ (2)​, రిత్విక్  (ఐదు నెలలు) ఉన్నారు. కిరణ్​ పోచారంలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

ఈసీఐఎల్​కు వెళ్లి పది నిమిషాల్లో వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, కిరణ్​ బైక్​ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కిరణ్​ తలకు తీవ్రగాయాలువడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.