ట్రావెల్స్ బస్సు ఢీకొని ఐటీ ఎంప్లాయ్ మృతి

ముషీరాబద్, వెలుగు:  ట్రావెల్స్ బస్సు.. బైక్​ను ఢీకొట్టడంతో ఐటీ ఎంప్లాయ్ చనిపోయిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్​పేటకు చెందిన ధార మనోజ్ కుమార్(27) హైటెక్ సిటీ ఏరియాలోని ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.

శనివారం తెల్లవారుజామున 5 గంటలకు  బైక్​పై హైటెక్ సిటీ నుంచి శామీర్ పేటకు బయలుదేరాడు. ట్యాంక్​బండ్ వద్ద  సికింద్రాబాద్ నుంచి వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మనోజ్ కుమార్ బైక్​ను ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  డెడ్​బాడీని గాంధీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

వెహికల్ ఢీకొని ఒకరికి గాయాలు 

శంషాబాద్: వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన దేవన్న (60) శనివారం శంషాబాద్​కు వచ్చాడు. బెంగళూరు హైవేపై ఉన్న ద్వారకా హోండా షోరూం వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే టైమ్​లో ఓ వెహికల్ అతడిని ఢీకొట్టి వెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు హాస్పిటల్​కు తరలించారు.