
- వర్క్ ఫ్రమ్ హోమ్‌తో చిన్న సిటీల్లోని ఐటీ ఉద్యోగులకు మేలు
- ఐటీ సెక్టార్ వృద్ధి చెందాలంటే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి
- స్కిల్స్ పెంచే ప్రోగ్రామ్‌లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తేవాలని నిపుణుల సలహా
న్యూఢిల్లీ: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాపులర్ అవ్వడంతో టైర్ 2, 3 సిటీలలోని ట్యాలెంట్‌ను కూడా వాడుకోవడానికి ఐటీ కంపెనీలకు వీలుంటోంది. స్కిల్స్ పెంచడంతో పాటు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మెరుగైన ఇంటర్నెట్ అందివ్వడం వంటివి) డెవలప్ చేయాలని, తద్వారా గ్లోబల్ ప్రాజెక్టుల్లో వీరిని వాడుకోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఐటీ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇస్తున్నారు. యువత స్కిల్స్‌ను పెంచడానికి ప్రభుత్వం ఐదు నేషనల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రూ.500 కోట్లతో నేషనల్ ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది.
ఇండియాలో, గ్లోబల్‌గా ఉన్న డిమాండ్‌ను అందుకునేలా యువత స్కిల్స్ పెంచాలని చూస్తోంది. ఇది మంచి నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘వర్క్ ఫ్రమ్ హోమ్‌తో చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు దక్కుతున్నాయి. సంపాదించుకోవడానికి వీరికి వీలు కలుగుతుంది. ఇటువంటి ప్రొఫెషనల్స్‌ను సరిగ్గా వాడుకోవాలంటే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను తీసుకురావాలి. గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో వీరిని కలిపేందుకు ప్లాట్‌ఫామ్స్‌ను డెవలప్ చేయాలి’ అని టెక్ మహీంద్రా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ సొనెజా అన్నారు. చిన్న సిటీలలోని యువతను వాడుకోవాలంటే ఇంటర్నెట్ మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు.